జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, July 21, 2016

గరం మసాలా


కొత్త సినిమా గురూ!
చిత్రం: ‘గరం
తారాగణం: ఆది, అదాశర్మ, చైతన్యకృష్ణ
కథ, మాటలు: శ్రీనివాస్ గవిరెడ్డి
కెమేరా: టి. సురేందర్ రెడ్డి
సంగీతం: అగస్త్య
సమర్పణ: వసంత శ్రీనివాస్
నిర్మాత: సురేఖ పి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఆర్. మదన్
 
పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ల ఈడువాళ్ళయిన పక్కింటి అబ్బాయితోనో, అమ్మాయితోనో తల్లి తండ్రులు పోల్చడం సహజం. ఆ క్రమంలో ఒకర్ని తక్కువ చేస్తూ, వేరొకర్ని ఎక్కువ చేయడమూ సహజం. అలా ప్రత్యర్థులుగా పెరిగిన ఇద్దరు సమ వయస్కుల్లో ఒకరు అనుకోకుండా చిక్కుల్లో పడితే? అప్పుడు రెండోవాడే సహాయానికొస్తే? ఇదీ స్థూలంగా ‘గరం’ ఇతివృత్తం. ఇటీవలే ‘సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు’తో దర్శకుడైన రచయిత శ్రీనివాస్ గవిరెడ్డి మాటలతో సహా అందించిన కథ ఇది. నటుడు సాయికుమార్ తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు తలకెత్తుకొని, స్వయంగా నిర్మించిన సినిమా.
 
వివరంగా కథ చెప్పాలంటే, అనగనగా ఒక ఊరు. అందులో బలరామ్ (తనికెళ్ళ భరణి), మూర్తి (సీనియర్ నరేశ్)లవి పక్క పక్క ఇళ్ళు. బలరామ్ కొడుకు వరాల బాబు అలియాస్ వరం (ఆది). మూర్తి కొడుకు రవి (చైతన్యకృష్ణ). పక్కింటి రవి బాగా చదువుతున్నాడనీ, ప్రయోజకుడనీ చిన్నప్పటి నుంచి పోలికలు తేవడంతో రవి అంటే వరానికి పడదు. దానికితోడు మూర్తి కూడా తన కొడుకు గురించి నలుగురితో గొప్పగా చెబుతూ ఉంటాడు.

పెద్దయిన మన హీరో వరం చివరకు ‘మీ అందరితో గొప్పవాణ్ణి అనిపించుకుంటా’ అంటూ తన ఫ్రెండ్ (‘షకలక’ శంకర్)తో కలసి, సిటీకి బస్సెక్కేస్తాడు. అక్కడ బురఖాలోని అమ్మాయి (అదా శర్మ)ను చూసి ప్రేమి స్తాడు. ఆ అమ్మాయి కోసం ఏమైనా చేయడానికి సిద్ధమంటాడు. అదే సమయంలో బిజూ (కబీర్ దుహన్ సింగ్) అనుచరులు (సత్యప్రకాశ్ వగైరా) ఒక ఫోటో చేతిలో పెట్టుకొని, వెతుకుతుంటారు. ఆ వెతుకుతు న్నది ఎవరి కోసమనేది సస్పెన్స్‌గా నడుస్తుంటుంది. వారు ఎవరి కోసం, ఎందుకు వెతుకుతున్నారనే ఆసక్తికరమైన ట్విస్ట్ దగ్గర ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

సెకండాఫ్‌లో ఈ సస్పెన్స్ స్టోరీలోని ఒక్కో కోణం గురించి విడతలవారీగా వేర్వేరు ఫ్లాష్ బ్యాక్‌లతో విషయం బయటకు రావడం మొదలవు తుంది. హీరో తాను సిటీకి రావడం వెనుక ఉన్న అసలు కథ వివరిస్తాడు. తర్వాత కథాక్రమంలో - హీరో ప్రేమిస్తున్న హీరోయిన్‌కూ, విలన్లు వెతుకుతున్న వ్యక్తికీ లింక్ ఏమిటనే మరో ఇంట్రెస్టింగ్ కథ బయటకొస్తుంది. అవన్నీ ఏమిటన్నది తెరపై చూడాల్సిన విషయాలు.  
 ‘లవ్లీ రాక్‌స్టార్’ బిరుదుతో ముందుకొచ్చిన ఆది ఇటీవలి చిత్రాలన్నిటి యువ హీరోల ఫక్కీలోనే... హుషారుగా నర్తించారు. ఫైట్లు చేశారు.

కథలో ట్విస్టులకు అదాశర్మ, కీలకపాత్రగా సీనియర్ నరేశ్, కామెడీకి పోసాని, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వి- ఇలా చాలామంది ఈ సినిమాలో ఉన్నారు. ఆమిర్‌ఖాన్ ‘పీకే’ సిన్మాకూ, పాత్రకూ పేరడీగా బ్రహ్మానందం చేసిన కామెడీ, హీరో ఫ్రెండ్‌గా ‘షకలక’ శంకర్ కొన్నిచోట్లా బాగా నవ్విస్తారు. సినిమా చివరలో వచ్చే మంచి సెంటిమెంట్ కోణానికి నరేశ్ నటన కలిసొచ్చింది.
 
గతంలో ‘పెళ్ళయిన కొత్తలో’ లాంటి చిత్రాలకు బాణీలు కూర్చిన యువ సంగీత దర్శకుడు అగస్త్య చాలాకాలం తర్వాత మళ్ళీ వినిపించిన చిత్రం ఇది. ‘గరవ్‌ు గరవ్‌ు...’ లాంటి మాస్ గీతాలు, ‘సహారా సహారా సమీరా’ లాంటి సాఫ్ట్ పాటలు, ‘ఒయ్యారిభామా సయ్యాడదామా’ లాంటి బీట్‌లూ ఉన్నాయి. సమయ, సందర్భాల ఆలోచన లేకుండా వాటిని విని, చూసి ఆనందించాలి. గతంలో పలు హిందీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన కెమేరామన్ టి. సురేందర్‌రెడ్డి అనుభవం సినిమాకు పనికొచ్చేదే.
 
చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆ నలుగురు’కి కథారచయిత మదన్. ఆ తరువాత దర్శకుడిగా మారి, ‘పెళ్ళయిన కొత్తలో’, ‘ప్రవరాఖ్యుడు’ అందించిన ఆయన చావో, రేవోగా భావించి, ఈ ‘గరం’ కోసం సర్వశక్తులూ ఒడ్డారు. సామాన్య జనం మెచ్చడం కోసం అన్ని రకాల విన్యాసాలూ చేశారు. ఫస్టాఫ్ అంతా క్యారెక్టర్ల పరిచయం, కథకు తగ్గ పునాది సెట్ చేయడానికి పనికొచ్చింది. తొలి గంటలోనే ఐటమ్ సాంగ్ సహా మూడు పాటలు, రెండు ఫైట్లు వచ్చేస్తాయి. ఇక, అసలు కథ ఇంటర్వెల్ దగ్గర్నుంచి ఊపందుకుంటుంది. తీసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా, మాస్‌కు దూరం జరగకుండా అలవాటైన చిత్రాల ధోరణిలో వెళ్ళాలని చేసిన ప్రయత్నంగా ఈ ‘గరం’ చిత్రం ఒక మాస్ మసాలా!
- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 2016 Feb 13th, Saturday) 

0 వ్యాఖ్యలు: