జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, July 21, 2016

నలభై ఏళ్ల రజనీ కాంతి

An Old article written by me 
on Rajinikanth.. in Sakshi daily... from my archives 

రజనీకాంత్‌కు ఈ మంగళవారం (2015 August 18
ఒక మరపురాని రోజు. ఈ సౌతిండియన్ సూపర్‌స్టార్ వెండితెరపై
 తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఇవాళ్టి (ఆగస్టు 18)తో
 సరిగ్గా నాలుగు దశాబ్దాలు పూర్తవుతున్నాయి. కె. బాలచందర్
 దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ 
(తెలుగులో దాసరి ‘తూర్పు - పడమర’గా రీమేక్ చేశారు) 
సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం 1975 ఆగస్టు 18న రిలీజైంది. 
బస్ కండక్టర్‌గా జీవితం మొదలుపెట్టిన శివాజీరావ్ గైక్వాడ్, 
చిన్న చిన్న పాత్రల్లో రాణించి, విలన్‌గా పేరు తెచ్చుకొని, 
హీరోగా తిరుగులేని స్థానానికి చేరుకొని తమిళ తెరకు 
రజనీకాంతుడైన ప్రస్థానం ఎప్పటికీ ఒక ఆశ్చర్యకరమైన చరిత్రే.

 ఆరు పదుల వయసు దాటినా, ఇప్పటికీ తమిళ తెరపై
మకుటంలేని మహారాజుగా వెలుగుతున్న స్టార్ రజనీకాంత్.
 ఏడాదికో, రెండేళ్ళకో ఒక సినిమా చేసినా, బాక్సాఫీస్ వద్ద
 హిట్టయితే కలెక్షన్లకు ఆకాశమే హద్దని తమిళ ఫిల్మ్
 ఇండస్ట్రీ ఉవాచ. ఇప్పటికీ కొన్ని వందల సంఖ్యలో అభిమాన
 సంఘాలు, రాజకీయంగా ఒక్క అభిప్రాయం చెబితే దాన్ని
తు.చ తప్పకుండా పాటించే కోట్లాది అభిమానులు ఆయన
 సొంతం. భోగిగా మొదలై హిమాలయ గురువుల
బోధనలతో యోగిగా పరిణతి చెందిన జీవితం రజనీది.

 ఇంతకీ కాళీనా? కపాలీనా?
 భక్తియోగంలో ఆధ్యాత్మికతను అనుసరిస్తూనే
కర్మయోగంలో నటనను వదులుకోని రజనీకాంత్
ఇప్పుడు తన 159వ సినిమాతో మళ్ళీ కెమేరా ముందుకు
 రావడానికి బిజీ బిజీగా సిద్ధమవుతున్నారు. యువ దర్శకుడు
రంజిత్ నిర్దేశకత్వంలో సెట్స్ మీదకొస్తున్న తమిళ చిత్రం
సన్నాహాల్లో ఉన్నారు. వయసు మీద పడ్డ మాఫియా
డాన్‌గా రజనీ కనిపించే ఈ చిత్రానికి ఇటీవలి వరకు ‘కాళి’
అనే పేరు మీడియాలో ప్రచారమైంది. తాజా కబురేమిటంటే,
ఈ సినిమాకు ‘కపాలి’ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట.
కపాలీశ్వరుడనేది శివుడి పేరు. చెన్నైలోని మైలాపూర్
 ప్రాంతంలోని కపాలీశ్వరస్వామి కోవెల సుప్రసిద్ధం. ఈ సినిమా
కథ కూడా చెన్నైలోని మైలాపూర్‌లో మొదలవుతుందట.
అందుకే, ఈ పేరు పెట్టాలనుకుంటున్నారట.

 నిజజీవిత డాన్ కథ? అన్నట్లు, ఈ సినిమాలో రజనీ
పోషిస్తున్న పాత్ర పేరు కూడా కపాలీశ్వరన్ అట. ఒకప్పుడు
 మైలాపూర్‌లో నివసించిన కపాలీశ్వరన్ అనే మాఫియా
 డాన్ జీవితం కూడా ఈ కథకు స్ఫూర్తి అని కోడంబాకవ్‌ులో
గుసగుసలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి సెట్స్
మీదకు వెళ్ళనున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం
మలేసియాలో జరగనుంది. సినిమాలో మొదట కొద్దిసేపు
 మైలాపూర్, ఆ గుడి పరిసరాలు కనిపిస్తాయిట. రాధికా
ఆప్టే, ధన్సిక తదితరులు నటించే ఈ సినిమాతో రజనీ
 కొత్త రికార్డులు సృష్టిస్తారా? చూడాలి.

0 వ్యాఖ్యలు: