జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, October 16, 2015

ఫ్యామిలీ సెంటిమెంట్‌కీ... మాస్ యాక్షన్‌కీ... మధ్య ఊగిసలాట (సినిమా రివ్యూ - బ్రూస్‌లీ... ది ఫైటర్)

 .............................................
 చిత్రం - బ్రూస్‌లీ... ది ఫైటర్, తారాగణం - రామ్‌చరణ్, చిరంజీవి (అతిథి పాత్ర), రకుల్‌ప్రీత్ సింగ్, కృతీ కర్బందా, రావు రమేశ్, ‘మిర్చి’ సంపత్, నదియా, బ్రహ్మానందం, టిస్కా చోప్రా, మాటలు - కోన వెంకట్ - గోపీమోహన్, పాటలు - రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, సంగీతం - ఎస్.ఎస్. తమన్, కెమేరా - మనోజ్ పరమహంస, ఆర్ట్ - నారాయణరెడ్డి, ఫైట్స్ - అనల్ అరసు, రామ్-లక్ష్మణ్, విజయ్,ఎడిటింగ్ - ఎం.ఆర్. వర్మ, నిర్మాత - డి.వి.వి. దానయ్య, ఒరిజినల్ స్టోరీ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం - శ్రీను వైట్ల
 .............................................

 విషయంతో సంబంధం లేకుండా వినోదంతో మెప్పించే ప్రతిభావంతుడనే పేరున్న దర్శకుడు - శ్రీను వైట్ల. ఫైట్లు, డ్యాన్స్‌లు చితగ్గొట్టేసి, ఫ్యాన్స్‌తో ఈలలేసి, గోల చేయించే హీరో - రామ్‌చరణ్. ఈ కాంబినేషన్‌కు బోలెడంతమంది కమెడియన్లు, సవాలక్ష విలన్లు, సుపరిచితులైన పెద్ద ఆర్టిస్టులు - ఇలా చాలామంది తెరపై కలిస్తే? అలుపెరుగని షూటింగ్‌తో ఆరు నెలల్లో భారీ ఖర్చుతో ఒక సినిమాను సిద్ధం చేస్తే? అందులోనూ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఉన్న కథంటే? రామ్‌చరణ్ నటించిన ‘బ్రూస్‌లీ... ది ఫైటర్’ సినిమా గురించి ఇవన్నీ విన్నప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయమనే అందరూ అంచనాలు పెట్టుకొంటే తప్పు లేదు.

 మాస్ యాక్షన్‌తో... అక్కా తమ్ముళ్ళ అనుబంధం
  కథగా చెప్పాలంటే - రామచంద్రరావు (రావు రమేశ్, పవిత్రా లోకేశ్) దంపతులది మధ్యతరగతి కుటుంబం. వసుంధరా ల్యాబ్స్‌లో పనిచేస్తున్న రామచంద్రరావు తాను కాలేకపోయినా, కనీసం తన పిల్లాడైనా ఐ.ఏ.ఎస్. అవ్వాలనుకుంటాడు. కొడుకు కోసం కూతురి చదువును కూడా అశ్రద్ధ చేయబోతాడు. కానీ, అక్కకు చదువు మీద ఉన్న ఆరాటం చూసి, తమ్ముడు త్యాగం చేస్తాడు. అలా తమ్ముడు కార్తీక్ (రామ్‌చరణ్) సినిమాల్లో స్టంట్ మ్యాన్‌గా మారి, అక్క కావ్య (కృతీ కర్బందా) ఐ.ఏ.ఎస్. అవడానికి అన్ని విధాలుగా సహకరిస్తుంటాడు. అయితే, తాను చేస్తున్న సాయం కూడా తండ్రికి తెలియకుండా చేస్తుంటాడు. గేమింగ్ డెవలపర్ అయిన హీరోయిన్ రియా (రకుల్‌ప్రీత్ సింగ్) హీరోను చూసి, పోలీసనుకొని ప్రేమిస్తుంది. హీరో కూడా ఆమె ప్రేమలో పడతాడు. మరోపక్క హీరో తండ్రి పని చేసే సంస్థ ఓనర్ ‘పద్మశ్రీ’ జయరాజ్ (‘మిర్చి’ సంపత్), ఆయన భార్య వసుంధరా దేవి (నదియా) తమ కొడుకును హీరో అక్కకిచ్చి పెళ్ళి చేయాలని భావిస్తారు. అనుకోకుండా ఒక డ్రగ్ మాఫియా వ్యవహారంలో దీపక్‌రాజ్ (అరుణ్ విజయ్) మోసానికి అక్క గురైనట్లు హీరోకు తెలుస్తుంది. దాంతో, అతణ్ణి ఢీ కొంటాడు హీరో. చిత్తుగా కొట్టి, కోమాలో పడేటట్లు చేస్తాడు.
  సెకండాఫ్ మొదలయ్యాక, ఈ దీపక్‌రాజ్ అసలు కథ బయటకొస్తుంది. జయరాజ్ ఒక మేక వన్నె పులి అనీ, అతనికి అంతకు ముందే మాలిని (టిస్కా చోప్రా) అనే మరొకరితో పెళ్ళి అయిందనీ, వాళ్ళకు పుట్టిన బిడ్డ దీపక్‌రాజ్ అనీ, ఆస్తి కోసం అతను వసుంధర భర్తగా ఉన్నాడనీ బయటపడుతుంది. ఆ తరువాత హీరో తెలివిగా ఆ సంగతి వసుంధరకు తెలిసేలా చేయడం, విలన్ ఆట కట్టించడం ఓపికగా చూడాల్సిన మిగతా సినిమా.
  
 తెర నిండా తారలే!
  కార్తీక్ పాత్రలో రామ్ చరణ్ ఎప్పటి లానే తన డ్యాన్సులు, ఫైట్లతో అలరించారు. ఆంగికం, వాచికాల్లో కూడా సినిమా సినిమాకూ తనను తాను మెరుగుపరుచుకుంటున్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం యువతరంలో క్రేజున్న కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ ఇందులో సిన్సియర్ పోలీసంటే పడి చచ్చే గేమింగ్ డెవలపర్ రియా పాత్రలో కనిపించారు. ఆమె అభినయం కన్నా అందానికి పెద్ద పీట వేసిన సినిమా ఇది. హీరో అక్కగా కృతీ కర్బందా పోషించిన పాత్ర కథాపరంగా మంచిదైనా, కథనంలో దాన్ని ఉపయోగించుకున్న సీన్లు చాలా తక్కువ. దాంతో, ప్రస్తుతం కన్నడంలో పేరున్న హీరోయిన్ అయిన కృతి యాక్టింగ్ టాలెంట్ పెద్దగా బయటపడలేదు. ఇక, హీరో తండ్రిగా రావు రమేశ్, ఇంకా నదియా, ‘మిర్చి’ సంపత్, ముఖేశ్ ఋషి, శాయాజీ షిండే - ఇలా ఎటుచూసినా తెర నిండా తారలున్నారు. వాళ్ళవన్నీ స్క్రిప్ట్‌కు లోబడిన పరిమిత పాత్రచిత్రణలే అయినా, కథకు వెన్నుదన్నుగా ప్యాడింగ్‌కు ఉపయోగపడ్డారు.
  సినిమాలో వినోదం కోసం హీరో పక్కనే సప్తగిరి, జయప్రకాశ్‌రెడ్డి, సినిమాలో వచ్చే సినిమా హీరోగా బ్లాక్‌బస్టర్ బ్రహ్మాజీ పాత్రలో బ్రహ్మాజీ, విలన్ పక్కనే ‘వెన్నెల’ కిశోర్, థర్టీ ఇయర్స్ పృథ్వి, పోసాని కృష్ణ మురళి - ఇలా బోలెడంత మంది ఉన్నారు. వీళ్ళందరికి తోడు సెకండాఫ్‌లో వచ్చే సుజుకీ సుబ్రహ్మణ్యం అనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం నవ్విస్తారు. ఒకే ఒక్క సీన్‌లో వచ్చే ఆమిర్‌ఖాన్ ‘పీకే’ తరహా పాత్రలో అలీ కనిపిస్తారు. అయితే, వీళ్ళందరూ కాలక్షేపానికి పనికొచ్చిన కరివేపాకులే.

 చిరు... పాత్ర! భారీ సందడి!!
  చాలా కాలం విరామం తరువాత చిరంజీవి తెరపై కనిపించిన సినిమా ఇది. కెరీర్‌లో ఇప్పటి దాకా ఆయన తెరపై కనిపించిన సినిమాలన్నీ లెక్కేసుకుంటే, వరుసలో ఇదే 150వ సినిమా. కొత్త సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్న సినిమా హీరో చిరంజీవిగా నిజజీవిత పాత్రలోనే ఆయన కనిపించారు. ఈ స్పెషల్ గెస్ట్ అప్పీయరెన్స్‌తోనే 150వ సినిమా మైలురాయి చేరుకున్నారు. క్లైమాక్స్‌లో హఠాత్తుగా ఆకాశంలో నుంచి హెలికాప్టర్‌లో దిగే చిరు కనిపించేది మూడు, నాలుగు నిమిషాలే అయినా అభిమానులకు అది పండగే. సొగసుగా నాలుగైదు పంచ్‌లు విసిరి, రౌడీలను చితగ్గొట్టి, హీరోయిన్‌కు కన్నుగీటి, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారంటూ గుర్రపుస్వారీ చేస్తూ వెళ్ళిపోయే క్షణాలు కడుపు నింపకపోయినా, కనువిందు చేస్తాయి. ‘లాస్ట్ మినిట్‌లో వచ్చి కాపాడారు’ అంటూ చిరును ఉద్దేశించి హీరో చెప్పే డైలాగ్ అర్థవంతమైనదనిపిస్తుంది. ఈ ఫైట్‌తో పాటు చిరంజీవి డ్యాన్స్ కూడా చేసేస్తే, అభిమానుల ఆకలి, బాక్సాఫీస్ కోరిక తీరేదేమో! కానీ, దాని కోసం చిరు పూర్తిస్థాయి వేషం వేసే 151వ సినిమా దాకా ఆగాల్సిందే!

 టెక్నీషియన్ల వర్క్ పుష్కలం
  నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్న ‘బ్రూస్‌లీ’లో పాటలు, ఫైట్ల కోసం చాలానే ఖర్చు పెట్టినట్లు తెరపై కనిపిస్తూనే ఉంటుంది. ఇక, తమన్ తనదైన పద్ధతిలో బీట్ ప్రధానంగా కట్టిన బాణీల్లో మాటలెలా ఉన్నా, వాద్యాల మోత భేషుగ్గా వినిపిస్తూ ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చే ‘లే చలో...’, మాస్ బీట్‌లో ఐటమ్ సాంగ్‌ను తలపించే టైటిల్‌సాంగ్ ‘బ్రూస్‌లీ...’ లాంటి ఒకటి రెండు మాస్‌ను ఆకట్టుకోవచ్చు. ‘ఏం మాయ చేశావే’తో మొదలుపెట్టి ‘రేసుగుర్రం’, ‘కిక్-2’ మీదుగా ఇప్పుడీ చిత్రానికి ఛాయాగ్రహణం వహించిన మనోజ్ పరమహంస రాను రానూ కాస్ట్‌లీ కెమేరామన్ అయ్యాడనిపిస్తుంది. తెరపై సీనిక్ బ్యూటీ కోసం బోలెడంత లైటింగ్ వాడిన ఆయన ఆ హడావిడిలో పడి, ప్రధాన పాత్రధారుల ఏ క్లోజప్, ఏ ప్రొఫైల్ అందంగా ఉంటుందో గుర్తించి, బాగా వాడడం మర్చిపోయినట్లున్నారు. సినిమాలో హీరో స్టంట్‌మ్యాన్ కావడంతో ఒకరికి నలుగురు ఫైట్ మాస్టర్లతో ఫైట్స్ కంపోజ్ చేయించారు. ప్రీ - ఇంటర్వెల్, ప్రీ - క్లైమాక్స్ ఫైట్స్ లాంటివి మాస్‌ను మెప్పిస్తాయి.

 ఎలా ఉందంటే...
  కథ, పాత్రల్ని బట్టి చూస్తే ఇది ఫ్యామిలీ సినిమానే! పిల్లల్ని ఐ.ఏ.ఎస్.లను చేయాలనుకొనే తండ్రి... ఇంట్లో ఒకరినే మంచి చదువు చదివించే స్థోమతే తండ్రికి ఉందని చిన్నతనంలోనే అర్థం చేసుకున్న కొడుకు... అక్క మీద ప్రేమతో ఆమెను ఐ.ఏ.ఎస్. చేయడానికి, చిన్నప్పుడే తన చదువును త్యాగం చేసే తమ్ముడు... డబ్బు కోసం, రాజకీయ ప్రాబల్యం కోసం ఎంతకైనా తెగించే ఒక యజమాని... ఇలాంటి పాత్రలు చాలా ఉన్నాయి. కానీ, అక్కాతమ్ముళ్ళ అనుబంధం, తండ్రీ బిడ్డల ప్రేమ లాంటి సెంటిమెంటల్ అంశాల మీద మరికొంత శ్రద్ధ పెడితే, కథ మరోలా ఉండేది. కానీ, ఎందుకనో ఆ పార్ట్‌ను అర్ధంతరంగా వదిలేసి, మాస్ యాక్షన్ వైపు దర్శక, రచయితలు మొగ్గారు.
  ఫస్టాఫ్‌లో కాసేపటికే క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ అయిపోయినా, హీరో పోలీసని హీరోయిన్ భ్రమపడే సీన్ల హంగామాతోనే చాలాసేపు గడిచిపోతుంది. తీరా ఇంటర్వెల్‌కు ముందు క్లైమాక్స్ అంత ఫైట్‌తో విలన్ విషయం బయటకొస్తుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే చెట్టంత కొడుకు (రవిప్రకాశ్) కనిపించకుండా పోయి, వారాలు గడుస్తున్నా హీరో పెదనాన్న పాత్ర (తనికెళ్ళ భరణి) కానీ, ఇతర పాత్రలు కానీ దాని గురించి పెద్దగా చింత పడినట్లు కనిపించదు. హీరో చెల్లెలి పెళ్ళి పనుల హడావిడిలో ఉన్నారనుకోవాలి. సినిమాలో ఒక హీరోను ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా కన్‌ఫ్యూజ్ అవడం, ఒకే పోలికలతో ఒకరికి ఇద్దరు జయప్రకాశ్‌రెడ్లు (ఒకరు ఫైట్ మాస్టర్ డేవిడ్‌గా, మరొకరు ఇన్‌స్పెక్టర్ రామ్‌జీగా) ఉండడం - లాంటి పాత కమర్షియల్ ఫార్ములా అంశాలూ ఉన్నాయి.
  సెకండాఫ్ మొదలైన కాసేపటికే విలన్ ఎవరు, ఏమిటన్న వ్యవహారమంతా అటు హీరోకూ, ఇటు ప్రేక్షకులకూ తెలిసిపోతుంది. ఇక, మిగిలినదంతా విలన్ ఆట హీరో ఎలా కట్టించాడన్నదే! కానీ, కీలకమైన ఆ భాగాన్ని ఆసక్తిగా నడపడంలో దర్శక, రచయితలు తడబడ్డారనిపిస్తుంది. విలన్, ప్రపంచానికి తెలియని విలన్ అసలు కొడుకు (దీపక్ రాజ్ పాత్రలో తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయకుమార్ కుమారుడు అరుణ్ విజయ్), విలన్ అసలు భార్య (బాలీవుడ్ నటి టిస్కా చోప్రా)ల మధ్య వ్యవహారం కలగాపులగంగా మారింది. అంతకు ముందు దాకా మంచివాడని చూపించిన జయరాజ్ (‘మిర్చి’ సంపత్) పాత్రను విలన్‌గా మార్చినప్పుడు ఒక క్షణం షాకింగ్‌గా అనిపించినా, అతని ప్రవర్తనకు రీజనింగ్ బలంగా నాటుకోదు. అలాగే, డ్రగ్ మాఫియా, కుటుంబంలో నమ్మకద్రోహం, అంతర్జాతీయ టైస్ట్ ముఠా - ఇలా రకరకాల అంశాలు కలపడంతో విలన్ గురించి క్లారిటీ కొరవడింది. మొత్తం మీద బ్రూస్‌లీ అని పేరు పెట్టడం వెనుక ప్రత్యేకమైన రీజనేమిటో బలంగా చెప్పని ఈ సినిమా కథ, కథనం పండగ పూట పెట్టిన పచ్చడి మెతుకులే తప్ప, పలావ్ భోజనం కాలేకపోయాయి.

- రెంటాల జయదేవ 
 ...............................................

 తెర వెనుక కబుర్లు 

 - ఈ సినిమాకు మొదట్లో ‘మై నేమ్ ఈజ్ రాజు...’, ‘ది సౌండ్’ లాంటి టైటిల్స్ కూడా అనుకున్నారు. చివరకు ‘బ్రూస్‌లీ... ది ఫైటర్’ అని ఖరారు చేశారు.
 - స్క్రిప్ట్‌లో సెకండాఫ్ చివరలో వచ్చే కీలకమైన అతిథి పాత్రకు చిరంజీవిని అడగాలనే నిర్ణయం దర్శకుడు శ్రీను వైట్లది. ఆ సంగతి
 - ‘బ్రూస్‌లీ’కి ముందు చేసిన ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లేవు. కానీ, ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా, ఫైట్ మాస్టర్ పాత్ర చుట్టూ తిరుగుతుంది కాబట్టి, రామ్‌చరణ్ ప్రత్యేకంగా బ్యాంకాక్‌కు వెళ్ళి, నెలన్నర పాటు ‘మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్’లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
 - ‘బ్రూస్‌లీ’ కోసం రామ్‌చరణ్ డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలు చేశారు. ఫలితంగా, ఒంటి నిండా గాయాలే!
 - సినిమా ప్రారంభం రోజునే రిలీజ్ డేట్‌ను కూడా ముందుగా ప్రకటించేసింది - చిత్ర యూనిట్. ఇటీవలి కాలంలో ఒక పెద్ద హీరో చేసిన భారీ చిత్రానికి ఇలాంటి వ్యూహం అనుసరించడం ఇదే తొలిసారి. చెప్పిన డేట్‌కు సినిమాను సిద్ధం చేసి, రిలీజ్ చేయడానికి అందరూ శ్రమించారు. హీరో రామ్‌చరణ్ ఒక రోజు ఏకంగా 24 గంటల పాటు ఏకధాటిగా షూటింగ్‌లో పాల్గొన్నారు.
 ...............................................

0 వ్యాఖ్యలు: