జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, March 16, 2015

నా బోధనకు... నేనూ శిష్యుణ్ణే! - స్వామి సుఖబోధానంద (ఇంటర్వ్యూ)

నా బోధనకు...  నేనూ శిష్యుణ్ణే!
ఆయన కాషాయం ధరిస్తారు...
కానీ, ఆధునిక కార్పొరేట్ ఉద్యోగులకు పాఠాలు చెబుతారు!


ఆయన చదివింది - భగవద్గీత, వేద వేదాంతాలు, ఉపనిషత్తులు...
కానీ, ఆయన బోధించే అంశాల్లో ‘మనీ మేనేజ్‌మెంట్’ ఒకటి!


ఆయన స్వతహాగా కన్నడిగుడు...
కానీ, సంస్కృత శ్లోకాలను ప్రస్తావిస్తూ,
ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ, కన్నడాల్లో ఒక భాష నుంచి
మరో భాషలోకి సునాయాసంగా మారుతూ, అనర్గళంగా మాట్లాడేస్తారు!


ఆయన కాలేజీ చదువు కేవలం బి.కామే...
కానీ, ఆయన రాసిన ‘మనసా! రిలాక్స్ ప్లీజ్’ సహా నూటికి పైగా పుస్తకాలు
లక్షల్లో అమ్ముడవుతున్నాయి. కోట్లమంది చదువుతున్నారు!


ఒత్తిడి నిండిన ఆధునిక జీవితంలో...
అలసిన మనసులకు... ఆధ్యాత్మిక సూత్రాలను బోధిస్తూ...
జీవన సుఖాన్ని అందిస్తున్న ఆధునిక గురువు - స్వామి సుఖబోధానంద.


హీరో చిరంజీవి నుంచి పారిశ్రామికవేత్త జి.ఎం.ఆర్. దాకా ఎందరెందరినో
తన బోధనలతో ఆకట్టుకున్న ఘనత - ఈ మోడ్రన్ స్వామీజీది!


‘లైఫ్’ మేనేజ్‌మెంట్ నుంచి మనీ మేనేజ్‌మెంట్ దాకా గడచిన మూడున్నర
దశాబ్దాలుగా కొన్ని వేల వర్క్‌షాపులు నిర్వహించడం ఆయన ప్రత్యేకత.


బెంగుళూరులో ‘ప్రసన్న ట్రస్ట్’ ద్వారా విద్య, ఆరోగ్యం, సేవా రంగాల్లో
కృషి సాగిస్తూ, ఇటు ఆధ్యాత్మికత, అటు ఆధునికతల సమ్మేళనమైన
ఈ ఆధ్యాత్మిక, ‘కార్పొరేట్ గురు’ అంతరంగ ఆవిష్కరణ...


ఈ కార్తిక మాసపు ఆదివారం ‘సాక్షి ఫ్యామిలీ’ పాఠకులకు ప్రత్యేకం.

 
 
 నమస్కారం స్వామీజీ! మీ పేరే - ‘సుఖబోధానంద’. కానీ, నిజానికి సుఖమనేది ఒక మానసిక స్థితే కదా. మరి, అది ఇతరులకు చెప్పి, చేయించగలిగిదేనంటారా? 


సన్న్యాసదీక్షలో మా గురువిచ్చిన నామమిది. మన సంప్రదాయంలో పెద్దలు పేరుపెట్టేది - దాని అంతరార్థాన్ని గ్రహించి, స్వయంగా ఆచరణలో పెట్టడం కోసం! ‘సుఖేన బోధయతి చ అసౌ ఆనందః - సుఖబోధానంద’. అంటే ఆనందమనే అంశాన్ని అనాయాసంగా (సుఖంగా) బోధించేవాడు. ఆ లక్ష్యాన్ని నాకు నిర్దేశిస్తూ, ఆ పేరు పెట్టారన్న మాట.

నవ్వుతూ నవ్విస్తూ.. మీ బోధన విధానం కూడా గమ్మత్తుగా ఉందే?

బోధన మూడు రకాలు - నారికేళ ఫలం (కొబ్బరికాయ), కదళీ ఫలం (అరటిపండు), ద్రాక్షా ఫలం. కొందరి బోధనలు కొబ్బరికాయలా పగలగొట్టి, కష్టపడితే కానీ లోపలి కొబ్బరి గుజ్జు లభించదు. మరికొందరి బోధనలు అరటిపండులా  పై తొక్కను వలిచితే, లోపలి పండు సులభంగా తినవచ్చు. ద్రాక్షా ఫలమనేది నోట్లో వేసుకుంటే చాలు, రుచి తెలుస్తుంది. నేను ఆ విధానాన్ని అనుసరించా. ద్రాక్షపండు పెడదామన్నా కొందరు సులభంగా నోరు తెరవరు. అందుకే, హాస్యరసాన్ని వినియోగిస్తుంటా. వినోదం మధ్య అసలు బోధనను జొప్పిస్తుంటా. జీవితాన్ని సుఖవంతం చేసుకొనే విధానాన్ని చెబుతుంటా. అందుకేనేమో, నన్ను ‘మోడ్రన్ స్వామీజీ’ అంటారు.
     
అసలు ఈ బోధనల వైపు ఎందుకొచ్చారు?  

చిన్నప్పటి నుంచి అధ్యాపక లక్షణాలు నాకెక్కువ. అందుకే, గురువులు అటువైపు ప్రోత్సహించారు. మొదట్లో భగవద్గీత, ఉపనిషత్తుల గురించే బోధించేవాణ్ణి. అప్పట్లో 45 ఏళ్ళ పై వయసు వాళ్ళే ఎక్కువ వచ్చేవారు. దాంతో, యువతరం ఎందుకు రావడం లేదని ఆలోచనలో పడ్డా. అవతలివాళ్ళు చెబుతున్నది వినడమనే దానిపై కాక, ఒకరితో మరొకరు మాట్లాడుకోవడమనే ‘డైలాగ్’ మీద యువతరానికి ఆసక్తి అని గ్రహించా. అలా ప్రవచన విధానం నుంచి పరస్పర సంభాషణ విధానంలోకి మారా. భగవద్గీతను ఆధునిక జీవితానికి అనుసంధానిస్తూ, వర్క్‌షాపులు చేస్తున్నా. ఆలోచించడా లనికి ప్రేరేపిస్తున్నా. ఒక్క మాటలో... ‘థాట్’(విచార్ - ఆలోచన) చలనం లేనిది. కానీ, ‘థింకింగ్’ (సోచ్‌నా -ఆలోచించడం) గతిశీలం. జీవితం కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ గతిశీలమైంది కాబట్టి, ‘థింకింగ్’ అవసరం.
 
ఆధ్యాత్మిక బోధనతో చాలా దేశాలే తిరిగినట్లున్నారు.


అవును. 25వ ఏట మొదలెట్టి ఇప్పటి దాకా బ్రిటన్, అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్, జర్మనీ - ఇలా ఎన్నో దేశాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించా.
     
మరి, మీరు నడిపే ప్రసన్న ట్రస్టు ఏమిటి?

1982లో ‘ప్రసన్న ట్రస్ట్’ ప్రారంభించాం. ‘ప్రసన్న’ అంటే ఆనందంగా ఉండడం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘...ప్రసన్న చేతసా...’ అంటాడు. శారీరకంగా, మానసికంగా మాత్రమే కాదు... ఆత్మస్థితిలో ఆనందంగా ఉంటే, జీవితంలోని సమస్యలన్నీ దూదిపింజలైపోతాయి. మన భగవద్గీతనూ, అదే సమయంలో మహమ్మదీయ, క్రైస్తవ, బౌద్ధ, జైన తాత్త్వికతలను ప్రస్తావిస్తూ ఈ జీవన రహస్య బోధన మా ‘ప్రసన్న ట్రస్ట్’ మొదటి పని. అనాథాశ్రమ నిర్వహణ, వికలాంగులకు కృత్రిమ అవయవాలు సమకూర్చడం, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయ - పునరావాస చర్యలు చేపట్టడం ట్రస్ట్ చేస్తున్న రెండో పని. మతాలకు అతీతంగా కార్పొరేట్ ప్రపంచంలో ఆధ్యాత్మికత వికాసానికి కృషి చేయడం మూడో పని. నేనెప్పుడూ ఆర్థిక వ్యవహారాలు చదివినవాణ్ణి కాదు, తెలిసినవాణ్ణి కాదు. కానీ, ‘బిర్లా సన్‌లైఫ్’ లాంటి వాళ్ళకు ‘ఆధ్యాత్మిక దృష్టితో ఆర్థికనిర్వహణ’ లాంటి అంశాలపై అనేక వర్క్‌షాపులు చేశా. డబ్బు విషయంలో ఆధ్యాత్మిక దృష్టేమిటి? ఎలా వ్యవహరించాలనేది చెప్పా. ఇలా 35 ఏళ్ళుగా లక్షలమందికి సాంత్వన కలిగించేందుకు ప్రయత్నించా.

చాలా భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నారు. మీ పూర్వాశ్రమ వివరాలేంటి?

మాది కర్ణాటక. పూర్వాశ్రమంలో నా పేరు ద్వారకానాథ్. మాది కలిగిన కుటుంబం. బెంగుళూరులోని అప్పటి ప్రసిద్ధ పాఠశాలల్లో చదువుకున్నా. సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో బి.కామ్ చదివాను. ఇప్పటి డిస్కో సెషన్స్ లాగా 1970లలో ‘జామ్’ సెషన్స్ అని జరిగేవి. కళాశాలలో చదువుతుండగా నా తోటి స్నేహితుల్లో చాలామంది మాదకద్రవ్యాలకు అలవాటుపడినట్లు గ్రహించా. జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళంతా ఆనందంగా ఉండాలనుకుంటున్నారే తప్ప, నిజంగా ఆనందంగా లేరని నాకు అర్థమైంది. ఆనందం ఎక్కడ ఉందనే అన్వేషణ మొదలుపెట్టా. అప్పుడే బెంగళూరులో స్వామి చిన్మయానంద రెండో జాతీయ గీతాయజ్ఞం చేస్తున్నారు. అక్కడకు వెళ్ళి ఆయన ప్రవచనం వినడంతో నా జీవితం మారింది. ఆనందం లభిస్తుందని భ్రమపడుతున్నవాటిలో నిజమైన ఆనందం లేదని అర్థమైంది.

 ‘ఆత్మలో ఎవరు ఆనందాన్ని చూస్తారో, వారు విజయులవుతార’ని భగవద్గీతలో చెప్పిన బోధ విన్నా. సుఖం, ఆనందం అనేవి ఈ భౌతికమైన పదార్థంలో లేదు. మనస్సులోనే ఉందని క్రమంగా గ్రహించా. అలా 19వ ఏట నా ప్రయాణం కొత్త మలుపు తిరిగింది. చిన్మయా మిషన్‌లో చేరి, ఆశ్రమవాసిగా ఉత్తర కాశీలో, బొంబాయిలోని ‘పొవై’లో శంకర భాష్యంతో గీత, ఉపనిషత్తులు చదివా. ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ చేశా. అది కేవలం డిగ్రీ చదువు కాదు, నా జీవితపథాన్ని మార్చేసిన అధ్యయనం.

కానీ ఈ స్థాయికి చేరాలంటే చిన్నప్పుడే బీజాలు పడి ఉండాలే?

అవును. చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ, మా అమ్మ చెప్పిన మాటల ప్రభావం నాపై ఎక్కువ. మా అమ్మమ్మ చెప్పిన నీతికథలు నాకిప్పటికీ గుర్తే. భారతంలో యుధిష్ఠిరుడంతటి వాడు ఎంతో ధర్మజ్ఞుడు అయినప్పటికీ, కేవలం జూదమాడడమనే బలహీనత వల్ల ఎంత దురవస్థ పాలయ్యాడో చెప్పేది. మనమెంత గొప్పవాళ్ళం, మంచివాళ్ళమైనా, ఒక్క బలహీనతతో పతనమవుతామని మాట ఇవాళ్టికీ మర్చిపోలేదు.

మరి మీ సన్న్యాసాశ్రమ స్వీకరణ గురించి...

స్వామి చిన్మయానంద నాకు బ్రహ్మచర్య దీక్ష ప్రసాదించారు. బ్రహ్మచారి నిత్యచైతన్య అని దీక్షానామమిచ్చారు. వేదాధ్యయనమయ్యాక, నా పద్ధతి, ఆలోచన గమనించి స్వామి దయానంద నాకు సన్న్యాస దీక్షనిచ్చారు. అప్పుడు గురువులిచ్చిన పేరే - ఈ ‘సుఖబోధానంద’.‘కామి గానివాడు మోక్షగామి కాడు’ అంటారు. మరి, మీ లాంటివారేమో బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్న్యాసం స్వీకరించడం...    (మధ్యలోనే అందుకుంటూ...) బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం స్వీకరించి, ఆ తరువాత సన్న్యాసాశ్రమంలోకి వెళ్ళడం ఒక పద్ధతి. అలా కాక, నేరుగా బ్రహ్మచర్యం నుంచే సన్న్యాసం తీసుకోవడమనే విధానానికి ఆది శంకరాచార్యులు బాట వేశారు. నాతో పాటు వేద, వేదాంత అధ్యయనం చేసినవారిలో సగం మందే ఇలా సన్న్యాసాశ్రమం స్వీకరించారు. మిగతా సగంమంది గృహస్థాశ్రమంలోకి వెళ్ళారు. అయినా, గృహస్థాశ్రమంలోని బాదరబందీలన్నీ అనుభవంలోకి వచ్చాకే సన్న్యాసం స్వీకరించాలనీ, అప్పుడే అందరికీ బోధించాలనీ అనుకుంటే తప్పు. పైల్స్‌తో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స చేయడానికి అనుభవం కోసం డాక్టర్ కూడా పైల్స్ రప్పించుకోనక్కర లేదు. డ్రగ్‌‌సకు బానిసలైనవారిని సరైన దోవలో పెట్టేలా బోధించడానికి డ్రగ్స్ వాడిన అనుభవం మనకు ఉండాల్సిన పని లేదు. ఇదీ అంతే!
     
ఇన్నేళ్ళుగా ఇంతమందికి బోధిస్తున్న మీ మీద ఎవరి ప్రభావం ఉంది? మీ బోధనలకు వేల సంఖ్యలో జనం రావడానికి కారణం?
 
స్వామి చిన్మయానంద, స్వామి దయానంద ప్రభావం ఎక్కువ. అప్పట్లో మా గురువులు చేసిన గీతా యజ్ఞాలకూ, ప్రవచనాలకూ పెద్ద సంఖ్యలో జనం వచ్చేవారు. దానికి నేను ప్రత్యక్షసాక్షిని. ఇప్పుడింకా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. నెలకు దాదాపు 4.5 లక్షల మంది మా వెబ్‌సైట్‌ను వీక్షిస్తూ, ఈ బోధనలతో సాంత్వన పొందుతున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు జీవితంలో ఒత్తిడి స్థాయి పెరిగింది. అలాగే, సరికొత్త వ్యామోహాలు, మనిషిని మోహంలో పడేసే వలలు - ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీటన్నిటికీ తోడు మీడియా, టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. అందుకే, ఇప్పుడు గతంలో కన్నా ఎక్కువ మంది ఆధ్యాత్మికత వైపు వస్తున్నారు. అయితే, చాలామంది ఒత్తిడిని దూరం చేసుకోవడానికంటూ రకరకాల వినోదాల వైపు మొగ్గుతున్నారు. అలా పలాయనం ద్వారా ఆ క్షణానికి ఒత్తిడికి దూరమైనా, మళ్ళీ ఒత్తిడిలోనే పడుతున్నారు. ఇలా పలాయనంతో కాక, మన లోపలి ఖాళీని చూడడం అవసరం. దాన్ని అన్వేషిస్తే, ఒత్తిడి దూరమై, ఆనందం లభిస్తుంది.

ఆధునిక కాలంలో, ఇప్పటి జీవనంలో భగవద్గీత ప్రాముఖ్యం?

భగవద్గీత లాంటి ఉత్తమ గ్రంథం ప్రపంచంలో మరొకటి  లేదంటా. మతోన్మాదంతో చెబుతున్న మాట కాదిది. వివిధ మత గ్రంథాలు చదివి, వాటిలోని మంచిని వర్క్‌షాపుల్లో ప్రస్తావించే వ్యక్తిగా అంటున్న మాట. కానీ, వేలమంది గోపికలతో తిరుగుతూ, యుద్ధతంత్రాలు నడిపి, మామూలు వ్యక్తిలా జీవించిన శ్రీకృష్ణుడు దేవుడేమిటనేవాళ్ళున్నారు. దేవుడంటే, సరైన మనిషి అంటే ఫలానాలా ఉండాలని మీకు మీరు అనుకొని, ఆ పరిధిలోకి శ్రీకృష్ణుణ్ణి ఇరికించాలని ప్రయత్నించకండి. పారమార్థిక సత్తా (యాబ్‌సొల్యూట్ రియాలిటీ), వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా (సబ్జెక్టివ్ రియాలిటీ)- ఈ మూడూ ఉన్నాయి ఆయనలో. ఆయన చేసినదంతా ధర్మం ప్రాతిపదికన చేసిందే తప్ప, మరొకటి కాదు.

కురుక్షేత్రంలో కురు - పాండవ సేనల మధ్య శ్రీకృష్ణుడు అంతసేపు ‘గీత’ చెప్పడం సాధ్యమా అనేవాళ్ళూ ఉన్నారు...

చూడండి. కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు బహుశా అర్జునుణ్ణి యుద్ధవిముఖుణ్ణి చేయడానికి కృష్ణుడు ప్రయత్నిస్తున్నాడేమో అని కౌరవులు అనుకొని ఉండవచ్చు. పాండవులేమో, అర్జునుడికి కృష్ణుడు శస్త్రాస్త్రాలు బోధిస్తున్నాడేమో అనుకొని ఉండవచ్చు కదా! తార్కికంగా చెప్పాలంటే అలా చెప్పవచ్చు. నిజానికి, కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య జరిగింది ఇన్‌ట్యూటివ్ డైలాగ్. స్వప్నం లాంటిది. మూడు నిమిషాల కలలోనే మనకు ఒక జీవితమంతా కనిపిస్తున్నప్పుడు, ఆ టైమ్‌స్కేల్‌తో చూసినప్పుడు యుద్ధక్షేత్రంలో భగవద్గీత ఎందుకు జరగదు!

మరణంపై మీరేమంటారు? పునర్జన్మలున్నాయా?

మరణమనేది జీవితానికి శత్రువు కాదు. మరణమనేది జీవితంలో జరిగే ఓ ఘటన. అది మన జీవితమనే యాత్రను మరో విధంగా పొడిగిస్తుంది. అది తెలియక మృత్యువంటే భయపడుతూ ఉంటాం. జీవితాన్ని సరిగ్గా జీవించకపోవడంతో వచ్చిన తంటా ఇది. సరిగ్గా జీవించినవారికి మృత్యువంటే భయం ఉండదు. పునర్జన్మ అంశానికి ప్రాధాన్యమివ్వను. ఎప్పుడో వచ్చే జన్మ కన్నా, ఇప్పుడున్న జన్మలో చేయాల్సిన మంచి పనులపై దృష్టిపెట్టడం ముఖ్యం.

మరి, విగ్రహారాధన గురించి ఏమంటారు?

విగ్రహారాధనలో తప్పేమీ లేదు. దాన్ని ఒక మతానికి ఆపాదిస్తూ, అపార్థం చేసుకోవడం తప్పు. సామాన్యులకు అర్థమయ్యేలా విగ్రహారాధనతో మొదలుపెట్టి, క్రమంగా నిరాకార బ్రహ్మను ఆరాధించే స్థితికి తీసుకురావాలి. బెంగుళూరులో ‘నిర్గుణ్ మందిర్’ నిర్మించాం. అక్కడ మంత్రోచ్చాటన ద్వారా అన్నింటా దేవుణ్ణి చూడడం సాధన చేయవచ్చు.

సమాజంలో పెరుగుతున్న ఆత్మహత్యా ధోరణికి మీ పరిష్కారం?

జీవితంలో ఎదురైన ప్రతి అనుభవం మన మంచికే అనుకోవాలి. అలా అనుకోనివారు, వాటి నుంచి లబ్ధి పొందడం తెలియనివారే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ప్రతి అనుభవాన్నీ మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి వినియోగిస్తే ఇబ్బంది ఉండదు.
     
కానీ, ఇవాళ ఉద్యోగ బంధాలూ క్లిష్టమయ్యాయి?

పై అధికారి ఎప్పుడూ తన కింది ఉద్యోగికి ప్రేరణనందించాలి. సమర్థంగా పనిచేయడానికి అవసరమైన విద్య, నైపుణ్యమివ్వాలి. ప్రోత్సహిస్తూనే, అవసరమైతే దండనకు వెనుకాడకుండా ఉండాలి. దీని వల్ల ఎవరైనా సరే చక్కటి పై అధికారి అవుతారు. ఇక, కింది ఉద్యోగులకు తమ పై అధికారితో స్నేహ సంబంధాలుండాలి. కలసికట్టుగా పనిచేయడం అలవరచుకోవాలి. చెప్పినపని చేయడానికి సిద్ధమన్నట్లుండాలి. అప్పుడు సంబంధాలు బాగుంటాయి.

మనీ మేనేజ్‌మెంట్ విషయంలో మీరిచ్చే సలహా?

మనం డబ్బును నిర్వచించాలే తప్ప, మనల్ని డబ్బు నిర్వచించకూడదు. అది కీలకం.‘మనీ మేనేజ్‌మెంట్’లో ప్రధానమైనది - రిస్క్ మేనేజ్‌మెంట్ తెలియడం. ఒకే వ్యూహానికి పరిమితం కాకుండా, ప్రత్యామ్నాయ వ్యూహం కూడా ఉండాలి. అలాగే, మరో ముఖ్య విషయం - డబ్బును ఎలా ఆపరేట్ చేయాలో తెలియాలి. దురాశ ఉండకూడదు. ఏం కావాలన్నది స్పష్టత ఉండాలి. సౌకర్యంగా జీవించడానికి తగినంత సంపాదించడం తప్పు కాదు కానీ, ఎంత సంపాదించినా ఇంకా కావాలని దురాశ పడితే, అది దుఃఖహేతువు.

సమాజంలో ఉన్నత శిఖరాలకు ఎదిగి, విజయాలు సాధించినవారు కూడా అసంతృప్తితోనే బతుకుతున్నారు. ఎందుకలా?

సఫలత (సక్సెస్) అనేది అంతిమం కాదు. అది వచ్చినంత మాత్రాన పరిపూర్ణత వచ్చినట్లు కాదు. ఎన్నెన్నో విజయాలు సాధించిన ప్రసిద్ధ హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో మొదలు ఇవాళ్టి వాళ్ళ దాకా ఎంతమంది పరిపూర్ణత లేక జీవితాలను అంతం చేసుకున్నారో మనందరం చూశాం. అందుకే,  జీవితంలో పరిపూర్ణత కోసం ప్రయత్నించాలి. సజ్జన, సాధు సాంగత్యంలో ఆ దిశగా పయనించాలి.
   
కానీ, ఆధ్యాత్మికత ముసుగులో దొంగ స్వాములూ వచ్చేశారే...


(చటుక్కున అందుకుంటూ...) ఒక్క హిందూ మతాన్నే లక్ష్యంగా చేసుకొని విమర్శించడం తగదు. ప్రతి మతంలోనూ ఈ దొంగస్వాముల ధోరణి వచ్చింది. కలియుగంలో అన్ని రంగాల్లో బూటకపు వ్యక్తులొచ్చేశారు. ఇవాళ సరైన గురువు దొరకాలని చూస్తున్నవారందరూ, ముందుగా తాము సరైన శిష్యులుగా ఉండాలి. మీరు సరైన శిష్యులైతే, సరైన గురువు లభిస్తారు. పైగా, గురువు అంటే మానవ రూపంలోని వ్యక్తే కానవసరం లేదు. దత్తాత్రేయుల వారు ఆకాశం, వాయువు, కుక్క, కోడి - ఇలా 24 మంది గురువులన్నారు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నానన్నారు. కాబట్టి, సమస్త జీవకోటినీ గురువులుగా భావిస్తే, ఎంతో నేర్చుకోవచ్చు.

గురువులు ముందుగా ఆచరించి, శిష్యులకు చెప్పాలంటారు. అలా ముందుగా మీరు చేసి, ఆ పైనే శిష్యులకు బోధించినవి?

శ్రీకృష్ణుడే ‘అభ్యాసేన తు కౌంతేయ’ అన్నాడు. అభ్యాసం ద్వారానే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు సిద్ధిస్తాయి. సంగీతమైనా సాధన చేస్తే కదా పట్టుబడేది. అయితే, ఒకటి పూర్తిగా ఆచరించి, ఆ తరువాతే ఇతరులకు బోధించాలనే సిద్ధాంతాన్ని నమ్మను. ఇతరులకు బోధిస్తున్న సమయంలో నా బోధనకు నేనూ శిష్యుణ్ణే. ఆ అవగాహన, వినమ్రత ఉంటే మనల్ని మనం మెరుగుపరుచుకుంటాం.
     
చుట్టుపక్కలవేవీ అంటకుండా జీవితం కుదిరేనా?

నీటిలోని తామరాకును చూడండి. నీటిలోనే ఉంటుంది. కానీ, నీళ్ళంటవు. అలా తామరాకు మీద నీటిబొట్టులా గడపాలి. ఆఫీసులో పార్టీకి వెళ్ళాల్సొచ్చిందనుకుందాం. వెళ్ళండి. తప్పు లేదు. కానీ, అక్కడ మనుషులతో గడపాలి కానీ, దురభ్యాసాలతో కాదు. వర్తమాన వ్యవహారంలో ఉండాలి కానీ, దాన్ని మనసుకు ఎక్కించుకోకూడదు.

50వ పడిలో మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నారట. ఎందుకలా?

మార్షల్ ఆర్ట్ అంటే, ధ్యానానికి అవసరమైన ఏకాగ్రతను అలవరచుకొనే యోగం. బౌద్ధ సన్న్యాసులు దీన్ని అనుసరిస్తుంటారు. పాము, కొంగలను చూసి, ‘తాయ్-చీ’ని కనిపెట్టారు. విల్లంబుల సూత్రాన్ని అనుసరించి మరో విద్య కనుగొన్నారు. నేను కూడా ‘అకీ -జు-జుత్సు’ అనే మార్షల్ ఆర్ట్‌ను బౌద్ధ భిక్షువుల నుంచే నేర్చుకున్నా.

{పస్తుతం మీ దృష్టి ప్రధానంగా దేని మీద ఉంది?

వీలైనంత ఎక్కువ మందికి బోధనల ద్వారా సాంత్వన కలిగించడం మీదే నా దృష్టి అంతా! ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ మా ప్రసన్న ట్రస్ట్ కార్యక్రమాలు విస్తరిస్తున్నాం. నా దగ్గర శిక్షణ పొందినవారు అక్కడ అవసరమున్నవారికి వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. దాదాపు నూటికి పైగా పుస్తకాలు రాశా. సరళంగా సాగే ‘మనసా! రిలాక్స్ ప్లీజ్!’ లాంటి నా రచనలు అనేక భాషల్లో లక్షల ప్రతులు అమ్ముడయ్యాయి.

హీరో చిరంజీవి సహా ప్రముఖులు మీ శిష్యులట!

(నవ్వేస్తూ...) నా బోధనలు, జీవితసారాన్ని చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పే తీరు నచ్చి నన్ను కలిసేవారిలో హీరో చిరంజీవి, జి.ఎం.ఆర్. సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావు లాంటి వారు చాలామందున్నారు.

భౌతిక ప్రపంచంలో మీ ఆధ్యాత్మికసామ్రాజ్య విలువ?

(గంభీరంగా...) ఆధ్యాత్మికతను మేము వ్యాపారం చేయలేదు. దానితో కోట్లు సంపాదించి, ఆస్తులు కూడబెట్టుకొనే ప్రయత్నమూ చేయలేదు. ఏ పని చేసినా స్వచ్ఛంగా, నిజాయతీగా చేయడం, ఆర్థిక విషయాల్లో అత్యంత పారదర్శకంగా ఉండడాన్ని నేను నమ్ముతాను. మాకు రాజకీయ పార్టీలు, నేతలెవరితోనూ సంబంధాలు లేవు. ట్రస్టు తరఫున చేస్తున్న సేవ, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కావల్సిన సొమ్ము భక్తుల నుంచే వస్తోంది. తిరిగి సామాన్యుల సంక్షేమానికే వినియోగిస్తున్నాం.

ఇంత పేరుప్రతిష్ఠలున్నవారెందరికో వందల కోట్లున్నాయి.

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వారి ‘స్పీకింగ్ ట్రీ’ ఇప్పుడు దేశంలోని అగ్రశ్రేణి ఆధ్యాత్మిక బోధకులలో నేను నాలుగోవాడినని పేర్కొంది. మొదటి ముగ్గురినీ, నన్నూ పోల్చి చూస్తే నా దగ్గరున్న మొత్తం అతి స్వల్పం. మాకున్నది బెంగుళూరులోని ఒకే ఒక్క ఆశ్రమం. డబ్బులో మునిగి తేలడం లేదు, అలాగని సాధారణ అవసరాలకు డబ్బు కొరత లేదు. అది చాలు ఆధ్యాత్మిక ఉద్యమంలో నేను ముందుకు నడవడానికి!
     
మీ మీద మీ అమ్మ గారి ప్రభావం చాలా ఎక్కువటగా?

మా అమ్మ రుక్మిణి చాలా తెలివైనది. ఆమెకి ఇప్పుడు 81 ఏళ్ళు. జీవితంలో నాకు ప్రాక్టికల్ గురువు ఆవిడే. ‘‘అడవి పువ్వులా ఉండాలి. పరిమళం కొంచెమైనా, దాన్ని అందరికీ పంచుతుంది’’ లాంటి ఆమె మాటలు మర్చిపోలేను.
     
ఇటీవలి కాలంలో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం?

ఇటీవల లక్నోలో అక్కడి రామకృష్ణా మిషన్ శాఖ పెద్ద స్వామి ముక్తినాథానందను కలిశా. ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మికతను జనంలోకి చొచ్చుకొనిపోయేలా కృషి చేస్తున్నందుకు అభినందించారు. ‘ఆధునిక వివేకానందుడి’గా నన్ను అభివర్ణించారు. ఆ వ్యాఖ్య ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఆఖరుగా సామాన్యుల సుఖానికి మీరు చెప్పే ‘జీవన మంత్ర’?

సాక్షాత్తూ సూర్యుడు చేయలేని పనిని, ఒక చిన్న దీపం చేయగలదు. నిశిరాత్రిలో వెలుగులు విరజిమ్మగలదు. ఆ చిరుదీపమే - ఆత్మవిశ్వాసం. జీవితంలో ఏ పని చేపట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. శ్రద్ధతో, నమ్మకంతో అడుగు వేయాలి. అప్పుడు విజయం వరిస్తుంది.
 

 - ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ

.......................................
Box1 

 ఎంతోమందికి మానసిక ప్రశాంతతను అందించడానికి వర్క్‌షాపులు చేస్తున్నారు. మీ అనుభవంలో జనం ఎదుర్కొంటున్న అయిదు ప్రధాన సమస్యలేంటి?

 మానసిక ఒత్తిడి, ఇతరులతో బంధాలు, మందు లేని మానసిక గాయాలు, స్వప్నం సాకారం కాకపోవడం, ఎదుటివాళ్ళేమనుకుంటున్నారోనన్న బెంగ - ముఖ్య సమస్యలు.


మరి వీటికి మీరిచ్చే విరుగుడు?


మానసిక ఒత్తిడి సంగతే తీసుకుంటే, పరిస్థితుల వల్ల మానసిక ఒత్తిడి కలగడం లేదు. కేవలం మనఃస్థితి వల్ల ఒత్తిడి ఫీలవుతున్నాం. దాన్ని అర్థం చేసుకుంటే, మనఃస్థితిని నియంత్రణలో పెట్టుకుంటే చాలు. ఇక, ఇతరులతో అనుబంధాల మాటకొస్తే, ఎదుటివాళ్ళు మనకు ఎలా ఉపయోగపడతారా అని ఆలోచిస్తున్నాం. భార్య - భర్త, తండ్రీ బిడ్డ... ఇలా అన్ని అనుబంధాల్లోనూ అదే సమస్య. కాబట్టి, అవతలివారిని ఉపయోగించుకోవాలని చూడకుండా, చేతనైనంతలో వారికి మనమే ఇవ్వడం, సాయపడడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇక, మానసిక గాయం విషయానికి వస్తే, జరిగిన సంఘటన కన్నా, మనసులోని ఆలోచన మనల్ని బాగా గాయపరుస్తుంది. ద్రౌపది నవ్వినందు కన్నా, ఆమె నవ్వింది, అవమానించిందన్న ఆలోచనే దుర్యోధనుణ్ణి బాధించింది. నాలుగోది - ఫలానాది కావాలంటూ కలగనడం ఒక రకంగా భవిష్యత్తు తాలూకు భావన. వర్తమానాన్ని వదిలేసి, భవిష్యత్తు మీదే దృష్టి పెట్టడం తప్పు. అయిదో అంశం - మనకు మనం ఆనందంగా, హాయిగా ఉండకుండా ఎంతసేపటికీ అవతలివాళ్ళ దృష్టిలో బాగుండాలని కోరుకుంటాం. అలా మన టీవీ రిమోట్ కంట్రోల్ ఎదుటి వ్యక్తి చేతిలో పెడతాం. అది తప్పు.
 ................................................


Box 2 

 ఇటీవల చదివిన పుస్తకాలు?

గతంలో బాగా చదివేవాణ్ణి. కానీ, ఇటీవల పుస్తకాలు చదవడం తగ్గింది. సామాన్యులు తమ జీవితాన్ని సరళం చేసుకొనేందుకు వీలుగా అందరికీ అర్థమయ్యేలా నా నిరంతర వ్యక్తిగత పరిశోధన నుంచి నేనే స్వయంగా పుస్తకాలు రాస్తున్నాను.

 మీరు సినిమాలు చూస్తారట. బాగా నచ్చిన సినిమా?

(నవ్వేస్తూ...) సినిమా చూడడం తప్పు కాదు. దేని కోసం చూస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నామన్నది ముఖ్యం. ఇటీవల ‘బ్లేమ్ ఇట్ ఆన్ ది స్టార్స్’ చూశా. బహుశా ఈ కథ తెలుగులో కూడా తీశారనుకుంటా. ఒక క్యాన్సర్ పేషెంట్‌కీ, కుడి కాలు లేని మరో వ్యక్తికీ మధ్య జరిగే కథ. వాళ్ళ ప్రేమ, జీవితానికున్న తాత్త్విక నిర్వచనం - ఇవన్నీ ఉన్న సినిమా అది.

సన్న్యాసులైన మీరు ప్రేమ కథలు చూడడమా?

(అందుకుంటూ...) ప్రేమ అనగానే తప్పుడు అర్థం తీసుకోకండి. ఒక తల్లికీ, బిడ్డకూ మధ్య ప్రేమ ఉంటుంది. ఒక గురువుకీ, శిష్యుడికీ మధ్య ప్రేమ ఉంటుంది. ప్రేమ, కరుణ లేకపోతే ఈ ప్రపంచం, ప్రాణి కోటే లేవు. ఆ దృష్టిలో మనం చూడాలి. ప్రేమ భావన అనంతం. దాన్ని కొలవలేం.

అంతర్జాతీయ వేదికలపైనా మీరు ఆధ్యాత్మికవేత్తగా ప్రాతినిధ్యం వహించినట్లున్నారు?

2005లో అనుకుంటా. దావోస్‌లో ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ సదస్సులో ప్రపంచం మొత్తం మీద నుంచి వంద మంది ప్రముఖులు పాల్గొన్నారు. అందులో భారత్ తరఫున ఆధ్యాత్మిక రంగం నుంచి హాజరయ్యా. అలాగే, ఐక్యరాజ్య సమితిలో జరిగిన సదస్సులోనూ హిందూధర్మ ప్రతినిధిగా పాల్గొన్నాను. అప్పుడే తొలిసారిగా నరేంద్ర మోడీ, నేను కలిశాం. మాట్లాడుకున్నాం. ఇటీవల కలిసినప్పుడు అవి గుర్తు చేసుకున్నాం.

‘కార్పొరేట్ గురు’ అని పేరు తెచ్చుకోవడం ఏమనిపించింది?

 (నవ్వేస్తూ...) అది నేను పెట్టుకున్నది కాదు. మీ లాంటి వాళ్ళు పెట్టినపేరు. కార్పొరేట్ ఉద్యోగుల నుంచి సామాన్యుల దాకా ప్రతి ఒక్కరికీ వర్క్‌షాపులు పెట్టి, సరళమైన జీవన సూత్రాలను బోధిస్తుండడంతో పత్రికల వాళ్ళు అలా రాశారు. అప్పటి నుంచి అదే పాపులరైపోయింది.
  
మీ మార్గంలో అత్యంత సంతృప్తినిచ్చిన క్షణాలు?

ఇప్పటికీ దేశంలోని అజ్ఞానం, అవిద్య లాంటివన్నీ చూసినప్పుడు, సంతృప్తి కన్నా అసంతృప్తినిచ్చిన క్షణాలే ఎక్కువ. కాకపోతే, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగడమనే ఈ ప్రయాణం తృప్తినిస్తోంది.
 
ఇన్నేళ్ళుగా బోధిస్తున్న మీకే అంతుచిక్కని సంగతి?

 ఎందరో ఆధ్యాత్మిక బోధకులు, గురువులు చెవినిల్లు కట్టుకొని చెబుతున్నా, ఇప్పటికీ కొందరు మారకపోవడం! సందేహిస్తూ ఉండడం! జీవితమంతా సంపాదన, శరీర సుఖాల పైనే దృష్టి పెడుతుండడం!
 
 - ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ


(Published in 'Sakshi' daily, 9th Nov 2014, Sunday)
.........................................

0 వ్యాఖ్యలు: