జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, September 15, 2014

ఒకే ఒక్క భారతీయ విదుషీమణి - సినీ నటి భానుమతి (by గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ రచయిత, నటుడు)

నేను నా జీవితంలో ప్రత్యక్షంగా చూసిన
మొదటి సినీ నటి - భానుమతి గారు. అది
 సరిగ్గా ఇప్పటికి 62 ఏళ్ళ క్రితం సంగతి.
నాకు అప్పుడు పన్నెండేళ్ళు. విశాఖపట్నంలోని
 చిన్నం వారి వీధిలో ‘పూర్ణా పిక్చర్స్’ అధిపతి
 గ్రంథి మంగరాజు గారి ఇంటికి ఆమె వచ్చారు.
మంగరాజు గారు ప్రసిద్ధ సినీ పంపిణీదారులు.
విశాఖపట్నంలోని ‘పూర్ణా టాకీస్’ కట్టింది
ఆయనే. అప్పుడే భానుమతి గారి ‘ప్రేమ’ (1952)
చిత్రం విడుదలైంది. కారు దిగి, ఇంట్లోకి
వెళుతున్న ఆమెను చూస్తే, ఒక మెరుపు
తీగలా కనిపించింది. ఆ తరువాత నా
జీవితంలో చాలామంది సినీ తారల్ని
చూశాను. ఆ పైన నేనూ వాళ్ళలో
ఒకణ్ణయ్యాను కానీ, అంత అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటీమణిని
నేనెన్నడూ చూడలేదు.

ముగ్ధుల్ని చేసే...ఆ ‘మల్లీశ్వరి’ దృశ్యం: భానుమతి గారి సినిమాలంటే,
నాకు ఇప్పటికీ ఠక్కున గుర్తొచ్చేది - ‘మల్లీశ్వరి’ (1951).
ఆ సినిమా నాటికి ఆవిడ ఓ 8 - 9 చిత్రాలు చేసి ఉంటారేమో!
అందులో నాగరాజు పాత్ర పోషించిన (ఎన్టీ) రామారావు గారికి
అది తొలి ఆరేడు చిత్రాల్లో ఒకటనుకుంటా! అప్పటికి రామారావు
గారు తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌ను ఇంకా పట్టుకోని రోజులవి. ఆ
 సినిమా చూస్తుంటే, ఆవిడ బాడీ లాంగ్వేజ్‌కు ఏ మాత్రం దగ్గరగా
 రామారావు గారు కనిపించరు. అయితేనేం, అటు మల్లీశ్వరిగా
భానుమతి గారు, ఇటు నాగరాజుగా రామారావు గారి
జంట ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.
నా జీవితంలో నేను ముగ్ధుణ్ణయిన ఒక్క షాట్‌ను
చెప్పమంటే - ‘మల్లీశ్వరి’లోని ఒక ఘట్టం చెబుతాను.
తిరునాళ్ళకు వెళ్ళి, నాగరాజు, మల్లీశ్వరి తిరిగి వస్తూ,
వర్షం వల్ల ఒక మందిరంలో తలదాచుకున్నప్పుడు,
రాయల వారు - తిమ్మరుసు మారువేషాల్లో చూస్తారు.
మల్లికి రాణివాసం పల్లకీ పంపమని వాళ్ళతో నాగరాజు
అంటాడు. అలా చెప్పినప్పుడు, అతణ్ణి వెక్కిరిస్తూ
మల్లి ‘పంపించండి సామీ! రాణివాస ప్పల్లకీ!’ అని
గమ్మత్తై కంఠంతో, హావభావాలతో చెబుతుంది.
ఈ ఒక్క షాట్ కోసం - ‘మల్లీశ్వరి’ని చూడండి. ఇప్పటికే
‘మల్లీశ్వరి’ని చూసేసిన వాళ్ళు కూడా ఈ షాట్ కోసం
మళ్ళీ ‘మల్లీశ్వరి’ని చూస్తే, నా అంత ముగ్ధులవుతారని
 ఆ సినిమా విడుదలైన ఇన్నేళ్ళ తరువాత
ఈ 2014లో కూడా నేను ఢంకా బజాయించి
చెప్పగలను. అదీ భానుమతి గారి ప్రతిభ.

నటుడిగా నేను ఆమెకు లొంగిన క్షణం:

 అయితే, ఈ ఇమేజ్‌కు ఒక నెగటివ్ పార్శ్వం
కూడా ఉంది. ఆవిడ ఎంత ఇండివిడ్యువలిస్టిక్
ఆర్టిస్ట్ అంటే, ఒక్క ‘మల్లీశ్వరి’ తప్ప, లేదా
‘మల్లీశ్వరి’కి ముందు వచ్చిన ఏ
 ‘స్వర్గసీమ’ (1945) లాంటి పిక్చర్‌లోనో
తప్ప, మిగతా అన్ని సినిమాల్లోనూ,
అన్ని పాత్రల్లోనూ ఒక్క భానుమతే
కనిపిస్తుంది. భానుమతి అనే ఒక వ్యక్తిత్వం ఆమె చేసిన
ఏ పాత్రకూ ఒదగలేదు. అందుకే, ఆవిడ భౌతికంగా
వెళ్ళిపోయినప్పుడు నేను ‘కీ.శే. మల్లీశ్వరి అస్తమయం’ అని రాశాను.

ఆవిడ ఏ పాత్రనూ, ఎదుట నటించే ఏ నటుడినీ తన
కన్నా ఒక అడుగు ఎక్కువ ఎత్తున నిలబడనివ్వలేదు.
దానికి ఉదాహరణ నా అనుభవమే. పన్నెండేళ్ళప్పుడు
చూసినందుకే తన్మయుడినైన నేను, అలాంటి
భానుమతి గారితో కలసి నటించే అవకాశం ఒకే
ఒక్కసారి వచ్చింది - ‘మంగమ్మ గారి మనవడు’ (1984)లో!
నేను స్వతహాగా రచయితను గనక, ఆమె డైలాగ్‌కు
కౌంటర్‌గా నేను నా డైలాగ్‌ను మలుచుకొని చెప్పబోయాను.
అంతే! ఆమె నవ్వుతూనే, ‘గొల్లపూడి గారూ! మీరు
ఆ మాట అంటే, నేను మరో మాట అంటాను’ అని
 సున్నితంగా అన్నారు. నేను అభిమానించే నా
సీనియర్ గనక, నా పాత్ర ద్వారా ఆమెకు లొంగిపోయాను.

రచయితగా ఆమె చిత్రాలకు వేటికీ పని చేసే అవకాశం
నాకు కలగలేదు. కానీ, వ్యక్తిగతంగా నేనంటే ఆమెకు
ఎంతో గౌరవం ఉండేది. ఒకసారి మద్రాసులో శాస్త్రి
హాలులో ఏదో సభ జరుగుతోంది. అందులో ఆమె
ప్రసంగిస్తున్నారు. ఆమె మాట్లాడుతుండగా, నేను
హాలులోకి వెళ్ళాను. భానుమతి గారు తన ప్రసంగం
ముగిస్తూ, ‘నా తరువాత గొల్లపూడి మారుతీరావు
గారు మాట్లాడతారు... నా కన్నా చాలా గొప్పగా’
అంటూ మైకు వదిలి వచ్చి, కూర్చున్నారు.
అంత గౌరవం, అభిమానం, మాటలో చమక్కు చూపేవారు ఆవిడ.

స్వాభిమానం మాటున మంచుముద్ద:


ఒక వ్యక్తిగా చెప్పాలంటే, భానుమతి గారు ఎప్పుడూ
తన ఒంటి మీద ‘స్వాభిమానం’ అనే అంగీని తొడుక్కొని
ఉండేవారు. అది దాటి చూడగలిగితే, ఆమె ఆర్ద్రతతో,
మంచు ముద్ద కాగలిగిన మంచి తల్లి. ఇది నాకు వారి
అబ్బాయి డాక్టర్ భరణి కళ్ళ నిండా నీళ్ళతో స్వయంగా
 చెప్పిన విషయం. భానుమతి గారి లాంటి పెద్దావిడ
ఒక వ్యక్తి సామర్థ్యానికి వాత్సల్యంతో లొంగిపోయిన
సందర్భం నాకు తెలిసి - ఒకే ఒక్కటి! ఒకే ఒక్కరి
విషయంలో! అది మా వాసు (చిన్నవయసులోనే
 కన్నుమూసిన యువ దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్). ‘
మంగమ్మ గారి మనవడు’ చిత్రానికి మా వాసు
అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాడు. ఆ కుర్రాడంటే
విపరీతమైన అభిమానం ఆవిడకి! వాడి ఉత్సాహం,
చురుకుదనం, ప్రతిభ చూసి ఆమె ఎంత ముచ్చటపడేవారో!
ఆశ్చర్యం ఏమిటంటే, ఆవిడ మా ఇంటికి ప్రత్యేకంగా
ఫోన్ చేసి మరీ, వాణ్ణి తన దగ్గరకు పిలిపించుకొనేవారు.

వాసు ఆకస్మిక మరణం తరువాత ‘గొల్లపూడి శ్రీనివాస్
మెమోరియల్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశాక, ఒక ఏడాది
అవార్డు కార్యక్రమానికి భానుమతి గారిని పిలవడానికి
వెళ్ళాను. అప్పటికే, ఆమె వార్ధక్యంలో ఉన్నారు. వయసు
మీద పడ్డ సింహపు రాణిలా ఉన్నారు. ‘ఆ కుర్రాడంటే నాకు
చాలా ఇష్టం. కానీ, నేను అంతసేపు కూర్చోలేను
మారుతీరావు గారూ!’ అన్నారు. చిన్నప్పుడు నా
కళ్ళ ముందు మెరిసిన మెరుపుతీగను అలా చూసేసరికి
కళ్ళు చెమర్చగా, వెనక్కి తిరిగి వచ్చేశాను.

సంప్రదాయాలు విడవని సినీ నటి:

చాలామందికి తెలియని విషయం
ఏమిటంటే, అంత గొప్ప సినీ నటి
అయినప్పటికీ, భానుమతి గారు
సంప్రదాయానికి ఎప్పుడూ విడాకులు
 ఇవ్వలేదు. ఆవిడ పూజ గదిలో
కుంకుమబొట్లు పెట్టిన వాళ్ళ అమ్మా
 నాన్న గార్ల ఫోటో నేను చూశాను.
ఆమె భర్త - సినీ దర్శకుడు పి.
రామకృష్ణారావు గారి ఫోటో నేను
చూశాను. అంత పెద్ద నటి, తాను సినిమాల్లో నటించే రోజుల్లో కూడా శ్రావణ
శుక్రవారాలకు కాళ్ళకూ, ముఖానికీ పసుపు రాసుకొనేవారని నిర్మాత బి. నాగిరెడ్డి గారి
పెద్ద కూతురు నాతో స్వయంగా చెప్పారు.

సినీ రంగానికి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి గారికి ఆమె ఒక మాట
ఇచ్చిందట - ప్రతి సినిమాలోనూ తప్పనిసరిగా ఒక త్యాగరాయ
కీర్తన పాడతానని! కర్ణాటక సంగీతం పట్ల, త్యాగరాజ స్వామి పట్ల,
తన సంగీతం మీద ఎన్నో ఆశలు పెట్టుకొన్న తండ్రి గారి పట్ల
ఆమెకున్న భక్తిప్రపత్తులకు ఇది నిదర్శనం.

దక్షిణ భారత చలనచిత్ర రంగంలో భానుమతిది ఓ చరిత్ర.
నటన, రచన, సంగీతం, గానం, చిత్ర నిర్మాణం, దర్శకత్వం,
స్టూడియో నిర్వహణ - అలా ఏకంగా 9 అంశాల్లో తనదైన
ప్రతిభతో జాతీయ స్థాయిలో బహుమతులందుకొన్న
ఒకే ఒక్క భారతీయ విదుషీమణి - పాలువాయి భానుమతి!

- సంభాషణ: రెంటాల జయదేవ
  
.............................................................................

0 వ్యాఖ్యలు: