జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, September 16, 2014

మా ఆయనే కాదు... మా తాతగారూ ఆర్టిస్టే! - నాయుడమ్మ మనుమరాలు, హీరో నాని భార్య అంజన

మా ఆయనే కాదు...  మా తాతగారూ ఆర్టిస్టే!
యలవర్తి 
నాయుడమ్మ... 
ఈ పేరు 
చెప్పగానే 
ఒక 
తరం 
వాళ్ళకు
 ప్రసిద్ధ 
శాస్త్రవేత్త 
గుర్తు
కొస్తారు. 
ఆయన దగ్గర 
చదువుకున్న 
విద్యార్థులకు 
అపూర్వమైన 
గురువు 
గుర్తుకొస్తారు. 
ఆయన వెంట చర్మశుద్ధి 
పరిశోధనా సంస్థలో 
పనిచేసినవారికి 
బడుగు వర్గాల 

బాగు కోసం 
అహరహం
 శ్రమించిన 
ప్రజల మనిషి 
గుర్తుకొస్తారు. 
‘ప్రజల 
శాస్త్రవేత్త’గా 
నిలిచి, 
ఎందరి 
మనసులనో 
గెలిచి, 
అనూహ్యంగా ‘కనిష్క’ 
విమాన ప్రమాదంతో 
దుర్మరణం పాలైన ‘పద్మశ్రీ’ 
నాయుడమ్మ (1922-1985)ను 
శాస్త్ర సాంకేతిక రంగం కానీ, 
సామాన్య జనం కానీ 
మర్చిపోకపోవడం ఆయన 
కృషికి గీటురాయి. మరి, 
ఆయన వ్యక్తిగా ఎలా 
ఉండేవారు, కుటుంబ 
విలువలను 
ఎలా పాటించేవారు 
వంటి విషయాలతో నాణానికి 
మరో కోణాన్ని చూపెడుతున్నారు - 
స్వయానా నాయుడమ్మ 
జీన్స్ పంచుకున్న 
మనుమరాలు, హీరో 
నాని భార్య - 
పాతికేళ్ళ శ్రీమతి అంజన. 
తాతగారిని ప్రత్యక్షంగా 
చూడకపోయినా, ఆయన 
గురించి విని, చదివి 
తెలుసుకున్న ఈ 
నవతరం సైన్స్ పట్టభద్రురాలు 
ఏం చెబుతున్నారో 
ఆమె మాటల్లోనే విందాం...

గుంటూరు జిల్లా తెనాలి దగ్గర యలవర్రు తాతగారి స్వస్థలం. పెరిగి
పెద్దయ్యాక ఆ ఊరి వాళ్ళకూ, తన దగ్గర చదువుకున్న విద్యార్థులకూ
ఆయన చాలా సాయపడ్డారు. అక్కడ మాకు ఆస్తిపాస్తులేమీ లేవు
కానీ, ఇవాళ్టికీ తాతగారి పేరు చెప్పగానే, ‘ఆయన వల్లే మేమింత
వాళ్ళమయ్యామమ్మా!’ అనేవాళ్ళు చాలామంది కనిపిస్తారు.
ఆ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది.
http://img.sakshi.net/images/cms/2014-09/41410287720_Unknown.jpg












అదే తాతగారు
మాకిచ్చిన పెద్ద ఆస్తి
అనిపిస్తుంది!

తాతగారికి
ముగ్గురు సంతానం.
వాళ్ళలో అందరి
కన్నా పెద్ద - మా నాన్న
రతీశ్. తరువాత మా
మేనత్త శాంతి. అందరి
న్నా 
చిన్న - మా బాబాయి
 కీ.శే. రమేశ్. తాతగారిలానే నాన్న
కూడా లెదర్
టెక్నాలజీలో డిగ్రీ చేశారు.
తోళ్ళశుద్ధిలో మరింత
అనుభవం కోసం నాన్నని
అప్పట్లోనే స్పెయిన్
 పంపించారట తాతగారు.
ఆయన చూపిన
బాటలోనే నడిచిన నాన్న
ఆ తర్వాత
విజయ నగరంలో లెదర్
ఫ్యాక్టరీ పెట్టుకుని
సక్సెస్‌ఫుల్‌గా నడిపారు.
నేను కూడా
 సైన్స్ పట్టభద్రురాలినే
కానీ, గీతమ్స్‌లో
 ఐ.టి. విభాగంలో
ఇంజనీరింగ్ చదివాక,
కార్పొరేట్ కమ్యూనికేషన్‌లో
మాస్టర్స్ డిగ్రీ చేశాను. మా
తమ్ముడు వరుణ్‌కి తాతగారి
తెలివితేటలు వచ్చాయి.

ఆయన మనుమరాలిని కావడం నా అదృష్టం!

మొదట్లో తాతగారి వ్యక్తిగత విషయాలు, కుటుంబంలోని
సంగతులే తెలుసు. కానీ, ప్రభుత్వ ఉన్నతాధికారిగా
రిటైరైన కాటా చంద్రహాస్‌గారు గత ఏడాది రాసిన నాయుడమ్మ
జీవిత చరిత్రతో తాతగారి గొప్పతనం, చిన్నవయసులోనే ఆయన
చేపట్టిన ఉన్నత పదవులు, సాధించిన విజయాలు, ఆయనను
వరించిన అనేక పురస్కారాల గురించి నాకు మరింత వివరంగా
తెలిసింది. అయితే, ఆ పుస్తకానికి కావాల్సిన వ్యక్తిగత ఫోటోలు
వగైరా సమకూర్చడంలో నేనూ పాలుపంచుకొన్నాను. అది
 నాకెంతో సంతోషాన్నీ, తృప్తినీ కలిగించింది. గత ఏడాది ఏప్రిల్‌లో
ప్రసిద్ధ శాస్త్రవేత్త ‘పద్మభూషణ్’ వి.కె. సారస్వత్ చేతుల మీదుగా
ఆ పుస్తకావిష్కరణ జరిగినప్పుడు, నాని, నేను ఆ పుస్తక ప్రతిని
 అందుకోవడం ఓ మరపురాని అనుభూతి! నాయుడమ్మగారి
లాంటి గొప్ప వ్యక్తి స్వయానా నాకు తాతగారయినందుకు
గర్విస్తున్నా! కానీ, ఆయనను ప్రత్యక్షంగా చూడలేకపోవడం,
ఆయన ప్రేమను పంచుకోలేకపోవడం నాకు తీరని లోటు!

ప్రజల శాస్త్రవేత్త...

తాతగారు తన దగ్గర పని చేసే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ
దాకా ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకొని పేరు పేరునా పలకరించేవారట!
చర్మాల శుద్ధి కోసం కాన్పూర్ నుంచి ప్రత్యేకంగా వచ్చే దిగువ తరగతి
 ముస్లిమ్ కుటుంబాలకు తాతగారు అండగా నిలిచారు. చర్మశుద్ధి 
చేసేవారికి కార్మికుల సంఘం లాంటివి పెట్టించి, వాళ్ళ బాగు కోసం 
పాటుపడ్డారు. నాయుడమ్మగారి మొదటి బ్యాచ్ శిష్యుల్లో ఒకరైన
 సుప్రసిద్ధ శాస్త్రవేత్త ‘పద్మశ్రీ’ టి. రామస్వామి ఆ మాటే చెప్పారు - 
‘‘మద్రాసులోని ప్రతిష్ఠాత్మక చర్మ పరిశోధనా సంస్థగా ‘సెంట్రల్ 
లెదర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ని నిలబెట్టిన ఘనత మీ తాతగారిదమ్మా! 
ఆయన లాంటి వ్యక్తిని మేము చూడలేదు. ఇటు సాంకేతిక 
నిపుణులనూ, అటు కార్మికులనూ దగ్గరకు చేర్చి, పరస్పర 
సహకారంతో సంస్థ ముందుకు దూసుకువెళ్ళేలా అద్భుతమైన 
మేనేజ్‌మెంట్ సూత్రాన్ని పాటించిన వ్యక్తి ఆయన! మేమంతా 
సాంకేతిక దృష్టితో నడిపితే, ఆయన జనసామాన్యాన్ని దృష్టిలో 
పెట్టుకొని, చర్మశుద్ధికారుల సంక్షేమ దృష్టితో ప్రపంచంలోనే 
అత్యంత విశ్వసనీయ సంస్థగా నడిపారు. ఆయనకున్న 
జనసమ్మోహన శక్తి అంతా ఇంతా కాదు! అందుకే ఆయన 
ప్రజల శాస్త్రవేత్త’ అయ్యారు’’ అని అన్నారు. ఆ మాటలు 
నేను ఎప్పటికీ మర్చిపోలేను!

తెనాలిలో ప్రొఫెసర్ విష్ణుమూర్తి గారు తదితరుల సమష్టికృషితో
 ‘డాక్టర్ వై. నాయుడమ్మ మెమోరియల్ ట్రస్ట్’ ఇప్పటికీ ప్రతి
ఏటా ఒక విశిష్ట శాస్త్రవేత్తకు నాయుడమ్మ పురస్కారం
అందిస్తోంది. పురస్కార గ్రహీతలైన పెద్ద పెద్ద సైంటిస్టులు వివిధ
అంశాలపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఏటా మా నాన్నగారు
తప్పనిసరిగా దానికి హాజరవుతుంటారు. అక్కడకు వెళ్ళి,
అంతమంది పెద్దవాళ్ళతో పాల్గొనాలంటే ఒక రకమైన భయం,
బెరుకు ఉండేది నాలో.. అందుకే వెళ్లేదాన్ని కాదు. కానీ, తాతగారి
మీద పుస్తకం చదివాక, ఇకనుంచీ ప్రతి ఏడాది ఆ పురస్కార
ప్రదానోత్సవానికి వెళ్ళాలన్న ఉత్సాహం వచ్చింది.

 ఆ డైరీలు ఇప్పటికీ భద్రంగా...

 రోజూ డైరీ రాసే అలవాటు ఉండేదట  తాత గారికి ! ఆ డైరీలన్నీ
సంవత్సరాల వారీగా ఇప్పటికీ మా నాన్న గారి దగ్గర భద్రంగా
 ఉన్నాయి. వాటిని ఎప్పుడూ మా నాన్నగారు తాకనిచ్చేవారు
 కాదు. వాటిని తీయకూడదని నా దగ్గర మాట కూడా తీసుకున్నారు.
కానీ, కుర్రతనంలో ఉండే సహజమైన కుతూహలంతో ఒకసారి
తాత గారి డైరీ ఒకటి తీసి, చూశా. అనుకోకుండా, అది చనిపోయిన
మా పెద్దన్నయ్య పుట్టిన 1980 నాటి డైరీ! అందులో ‘ఇవాళ
ఎంతో ఉత్సాహంగా ఉన్నా. రేపు ఉమ, రతీశ్‌లకు (అంటే,
మా అమ్మానాన్న) తొలి సంతానం పుట్టనుంది. తాతనయ్యే
క్షణాల కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ఆయన
రాసుకున్నారు. కానీ పాపం ఆయనకు తెలీదు...
ఆయనతోపాటే ఆ ఆనందం కూడా పోనుందని!

ఆ షాక్ నుంచి నాన్న ఇవాళ్టికీ కోలుకోలేదు!

తాతగారు భౌతికంగా దూరమైన క్షణాల గురించి
వింటుంటే, ఇప్పటికీ గుండె బరువెక్కిపోతుంది.
1985 జూన్ 23న జరిగిన కనిష్క విమాన ప్రమాదంలో
తాత గారు చనిపోయారు. దాదాపు 329 మంది
ప్రయాణిస్తున్న ఆ విమానంలో అందరూ చనిపోగా,
దాదాపు 120 మృతదేహాలే లభించాయట. మిగిలిన శవాల
ఆచూకీ కూడా తెలియలేదట. అలానే తాతగారి దేహం
కూడా దొరకలేదు. అతి పెద్ద విషాదం ఏమిటంటే...
ఆయన మృతదేహమైనా లభిస్తే తెద్దామని నాన్న
ఐర్లండ్ వెళ్లిన సమయంలోనే మా నాయనమ్మ
(అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ పవనాబాయ్) 
కూడా ఆత్మహత్యకు పాల్పడి, తాతగారిని చేరుకున్నారు. 
చిన్న వయసులోనే కన్నతల్లి బ్రెయిన్ ట్యూమర్‌తో 
మరణించడంతో, మారుటితల్లి అయిన పవనాబాయ్‌నే 
‘అమ్మా’ అని పిలుస్తూ, ఆమెలోనే కన్నతల్లిని చూసుకొని 
బతికిన మా నాన్న, నాలుగైదు రోజుల వ్యవధిలోనే తండ్రినీ, 
తల్లినీ  ఇద్దరినీ పోగొట్టుకున్నారు. దెబ్బ మీద దెబ్బగా జరిగిన 
మరో దుస్సంఘటన ఏమిటంటే, తాతయ్య, నాయనమ్మల
 కర్మకాండలు చేస్తూ, అందరూ హడావిడిలో ఉన్నప్పుడు 
పసివాడైన మా పెద్దన్నయ్య అనుకోకుండా నీటి తొట్టెలో
 పడి మరణించాడు. అలా తండ్రి, తల్లి, కొడుకు- ముగ్గురూ 
పది రోజుల వ్యవధిలో కళ్ళ ముందే కానరాని తీరాలకు 
తరలిపోవడం నాన్నకి తగిలిన అతి పెద్ద ఎదురుదెబ్బ! 
ఆ షాక్ నుంచి ఆయన ఇప్పటికీ కోలుకోలేదు!

 ప్రతి నిమిషం మా గుండెల్లో ఉంటారు...

 ఇప్పటికీ ఇంట్లో ఏ చిన్న సంతోష సందర్భం వచ్చినా,
‘మీ తాతగారు ఉండి ఉంటేనా...’ అని నాన్న అనకుండా
 ఉండరు. నేను స్కూల్‌లో పరుగుపందెంలో గెలిచిన
రోజు మొదలు హీరో నానితో నా పెళ్ళి వరకు ప్రతి సందర్భంలో
అదే మాట అనుకుంటూనే ఉన్నాం. వ్యక్తిగతంగా నాకైతే,
నా పెళ్ళిరోజున తాతగారు ఉండుంటే బాగుండేదనిపించింది.
సినిమా యాక్టర్‌తో పెళ్ళి అంటే ఆయన ఒప్పుకొనేవారో?
కాదో? అని ఎవరో అంటే, ఏమో అనుకున్నా కానీ,
ఆ సందర్భంలోనే తెలిసింది - తాతగారు కూడా ఊళ్ళో
నాటకాలు వేసేవారని! ఛత్రపతి శివాజీ వేషంలో
ఆయన ఫోటో ఇప్పటికీ నాన్న దగ్గర ఉందట!
అంటే, మా ఆయనే కాదు, మా తాత గారూ ఆర్టిస్టే!

 భౌతికంగా దూరమైన మూడు దశాబ్దాల తరువాత
కూడా తాతగారు మా మాటల్లో నిత్యం మిగిలే ఉన్నారు.
ఇక, ‘ప్రజల మనిషి’గా, దిగువ వర్గాల అభ్యున్నతికి
పాటుబడ్డ ‘ప్రజా శాస్త్రవేత్త’గా శాస్త్ర రంగంలోనూ,
సామాన్యుల గుండెల్లోనూ నిరంతరం వెలుగుతూనే ఉన్నారు.
వేర్ ఎవర్ యు ఆర్... ఐ లవ్ యూ తాత గారూ!

 - సంభాషణ: రెంటాల జయదేవ

..............................................

0 వ్యాఖ్యలు: