జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, March 9, 2012

బాలకృష్ణ ‘సి.ఎం.’పై మాట మార్చిన వై.వి.ఎస్. చౌదరి - నోరు విప్పని మీడియా

(ఫోటోల వివరం - ‘సింహా’లో బాలకృష్ణ, ‘నిప్పు’ చిత్రం విడుదలకు ముందు విలేఖరుల సమావేశంలో బొమ్మరిల్లు బ్యానర్ అధినేత, దర్శక - నిర్మాత వై.వి.ఎస్. చౌదరి)

ఒపీనియన్స్ ఛేంజ్ చేయనివాడు రాజకీయ నాయకుడు కాడన్నాడు మన ''కన్యాశుల్కం'' గిరీశమ్. ఆ విషయాన్ని తమకు కూడా అన్వయించుకొనేలా మార్చేసుకోవడంలో మన సినిమా వాళ్ళు ఘటికులు. అయితే, ఒపీనియన్ల గురించి మాత్రమే మన గిరీశం చెప్పాడు కానీ, మన సినిమా వాళ్ళు వాటిని ఫ్యాక్ట్ లు, ఫిగర్ల (వాస్తవాలు, గణాంకాల) దాకా విస్తరించారు. అభిప్రాయాలే కాదు, రెండు రోజుల క్రితం తామే స్వయంగా చెప్పిన, చేసిన ప్రకటనకూ, తమకూ ఎలాంటి సంబంధమూ లేదని కూడా నిష్పూచీగా చెప్పేస్తారు.

మొదటి సారి ప్రకటన చేసినప్పుడూ, తరువాత ఆ ప్రకటనతో తనకేమీ సంబంధం లేదన్నప్పుడూ కూడా మన మీడియా కెమేరాలు కళ్ళప్పగించి చూస్తాయి. సోదర జర్నలిస్టులు చెవులప్పగించి వింటారు. కానీ, మాట మార్చిన పెద్దమనిషిని అదేమిటని అడగరు. పైగా, మొదటి ప్రకటనను మీడియాయే తప్పుగా ప్రచురించిందని అడ్డంగా అబద్ధం ఆడేస్తూ, తప్పంతా పత్రికా వృత్తి మీద నెట్టేస్తుంటే, ఆ పెద్దమనిషిని నిలదీయరు. వృత్తి మీద నింద వేస్తున్నందుకైనా అతగాణ్ణి కడిగేయరు.

ఈ మధ్య ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. దర్శక - నిర్మాత వై.వి.ఎస్. చౌదరి తన తాజా చిత్రం ‘నిప్పు’ విడుదలకు ముందు, విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సినిమా విడుదలవుతున్న సమయం కావడంతో, పాత బాకీల బెడద తప్పించుకోవడానికో, మరెందుకో కానీ అక్కడే ఓ కొత్త సినిమా సంగతి కూడా లోపాయకారీగా బయటపెట్టారు. హీరో బాలకృష్ణతో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘సి.ఎం. (కామన్ మేన్)’ అనే సినిమాను తాను నిర్మిస్తున్నట్లు సాక్షాత్తూ వై.వి.ఎస్. చౌదరే మీడియా మిత్రులకు తెలిపారు. ఆ వార్తను ఆ రోజే టీవీలన్నీ హోరెత్తించాయి. మరునాడు కొన్ని దినపత్రికలూ యథావిధిగా ప్రచురించాయి.

కట్ చేస్తే, వారం పది రోజుల తరువాత వై.వి.ఎస్. చౌదరి నుంచి ఓ ఖండన ప్రకటన వచ్చింది. మీడియాలో ‘సి.ఎం.’ సినిమా గురించి వస్తున్న వార్తలు తప్పనీ, అసలు ఆ సినిమాతో తనకు కానీ, తమ బొమ్మరిల్లు బ్యానర్ కు కానీ సంబంధం లేదనీ, ఆ సినిమా తాము తీయడం లేదనీ, తాము తీస్తున్నట్లు వచ్చిన వార్తలు ఎవరో పుట్టించినవనీ వై.వి.ఎస్. వాక్రుచ్చారు. అడ్డంగా తన మాట మార్చేశారు. షరా మామూలుగా మన మీడియా అంతకు ముందు ఏమీ జరగనట్లే, ఈ వార్తనూ ప్రసారం చేసింది. పత్రికల్లో వేసింది.

అసలు ఈ వార్తలు, ఈ ఖండన ప్రకటనలతో అనుమానం వచ్చింది. కూపీ లాగితే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒపీనియన్ ను కాదు, ఏకంగా కెమేరాల సాక్షిగా స్వయంగా చెప్పిన మాటనే వై.వి.ఎస్. ఇలా మార్చేయడం వెనుక కృష్ణానగర్ వర్గాల సమాచారం ప్రకారం పెద్ద కథే ఉంది.

బాలకృష్ణతో గతంలో ‘ఒక్క మగాడు’ అనే ఓ భయంకరమైన ఫ్లాప్ చిత్రం తీసిన ఘన చరిత్ర నందమూరి వంశ వీరాభిమానిగా చెప్పుకొనే వై.వి.ఎస్. చౌదరి సొంతం. (అఫ్ కోర్స్, కమలహాసన్ తో దర్శకుడు శంకర్ రూపొందించిన భారతీయుడు చిత్రానికి పేలవమైన కాపీగా తయారైన ఆ సినిమాను ముందుగానే పెద్ద రేట్లకు చౌదరి అమ్మేసుకున్నారు. అలా చౌదరికైతే లాభాలు మిగిలాయి కానీ కొన్న బయ్యర్లే మట్టి కొట్టుకు పోయారు). ఇప్పుడు, ఈ కొత్త చిత్రం ‘సి.ఎం.’ తాలూకు ప్రకటనను కనీసం బాలకృష్ణతో మాట మాత్రంగానైనా చెప్పకుండానే వై.వి.ఎస్. ప్రకటించేశారట.

ఆ మాటకొస్తే, ఈ కొత్త సినిమా గురించి అసలు బాలకృష్ణకు తెలియనే తెలియదట. బాలయ్య బాబుతో కాకుండా ఆయనకు బంధువూ, అత్యంత సన్నిహితుడూ, ఆయన సినిమా వ్యవహారాలు చూసే వ్యక్తీ అయిన ఓ ఆరక్షరాల పెద్దమనిషితోనే ఈ సినిమా వ్యవహారమంతా వై.వి.ఎస్ మాట్లాడుకున్నట్లు భోగట్టా. వై.వి.ఎస్. కానీ, ఆ చిత్రానికి దర్శకుడిగా ఒప్పుకున్న కృష్ణవంశీ కానీ హీరో బాలకృష్ణను అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కలవనే లేదు, చర్చించనే లేదన్నది ఆంతరంగిక వర్గాల అత్యంత విశ్వసనీయ సమాచారం.

బాలయ్యకు బంధువైన సన్నిహితుడితో చెప్పేశాం కదా, ఇక బాలకృష్ణతో తరువాత మాట్లాడుకోవచ్చనుకున్నారో ఏమో, ‘నిప్పు’ విడుదల వేళ ఒత్తిళ్ళు తప్పించుకొనే హడావిడిలో వై.వి.ఎస్. ఈ బాలకృష్ణతో కొత్త సినిమా ప్రాజెక్టు వివరాలు మీడియాకు తెలివిగా ఊదారు. గతంలో ‘ఒక్క మగాడు’ చిత్ర సమయంలో ఆ ఆరక్షరాల బాలయ్య బంధువునే అడ్డం పెట్టుకొని, హీరో బాలకృష్ణకు 50 లక్షల రూపాయలు ఎగ్గొట్టిన వై.వి.ఎస్. చౌదరి ఈసారి కూడా ఆ బంధు మంత్రం పారుతుందని అనుకున్నట్లున్నారు. కానీ, ఇప్పుడు ఆ పాచిక పారలేదు సరి కదా ఎదురుతన్నింది. అసలు ఈ ప్రాజెక్టు గురించి తనకు ఎవరూ, ఏమీ చెప్పకుండానే పేపర్లలో వై.వి.ఎస్. లీకుతో వార్తలు వచ్చేసరికి బాలకృష్ణ అపర ‘లక్ష్మీ నరసిం’హుడే అయ్యారు.

ఇంతలో ‘నిప్పు’ రానూ వచ్చింది, అట్టర్ ఫ్లాప్ అవనే అయింది. అగ్నికి ఆజ్యం పోసింది. ఇక, ఆగ్రహంతో ఉన్న బాలయ్యను శాంతింపజేయడానికి ఏం చేయాలో ఎవరికీ తెలియలేదట. సినిమా చేస్తానని వై.వి.ఎస్.తో ఒప్పుకోవడమే తప్ప, అప్పటి వరకు బాలకృష్ణను స్వయంగా కలవడం కానీ, మాట్లాడడం కానీ చేయని దర్శకుడు కృష్ణవంశీకి కూడా గుండెల్లో రాయి పడింది. హీరో అయిన తనతో ప్రాజెక్టు గురించి మాట్లాడనైనా మాట్లాడకుండానే ఏకంగా సినిమా గురించి ప్రకటనే ఇచ్చేసిన దర్శక, నిర్మాతలతో సినిమా చేసేందుకు బాలకృష్ణ ససేమిరా అనేశారు. చివరకు వేరే దారి లేక, వై.వి.ఎస్. చౌదరే ‘సి.ఎం.’ చిత్ర ప్రకటనకు ఖండన జారీ చేయాల్సి వచ్చింది.

గమ్మత్తు ఏమిటంటే, అన్న మాటను వారం పది రోజులకే మింగేసిన వై.వి.ఎస్. ఆఖరికి తప్పంతా మీడియాలో వచ్చిన అసత్య వార్తలదే అన్నట్లుగా ఆ ఖండన ప్రకటన ఇచ్చారు. మీడియాలో ఒక్కరూ అదేమిటని అడిగిన పాపాన పోలేదు. మీరే విషయం చెప్పి, ఆనక మీరే మాట మార్చేసి, చివరకు తప్పంతా మీడియాలో వచ్చిన వార్తలది అంటారేమిటని ఒక్క జర్నలిస్టూ ధైర్యంగా అడగ లేదు. వై.వి.ఎస్.ను కడగలేదు.

కనీసం - మాట మార్చింది వై.వి.ఎస్సే తప్ప మీడియా కాదన్న సంగతి తెలిసే విధంగానైనా వార్త రాయలేదు, టీవీలో చెప్పలేదు. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాగా - ఆ రోజుకు ఆ వార్త, ఈ రోజుకు ఈ వార్త ఇచ్చేసి చేతులు కడుక్కున్నారు.

మీడియా మరీ ఇంత దారుణంగా తన మీద పడిన అకారణ నిందను ఎందుకు సహిస్తున్నట్లు.... ? సినిమాలకు ప్రచారం కోసం దర్శక, నిర్మాతలు, హీరోలు అందజేస్తున్న ‘అతిథి మర్యాదల’కు అలవాటు పడడమే దీనికి కారణమని వై.వి.ఎస్. సన్నిహితులు కుండబద్దలు కొట్టారు.

ఈ మాటతో పాటు, కొన్ని ప్రైవేటు ఎఫ్.ఎం. చానళ్ళు ఏకంగా పత్రికా విలేఖరుల మీద తరచూ వ్యంగ్యోక్తులు ప్రసారం చేస్తున్నట్లు వినవచ్చింది. నలుగురికీ చెప్పాల్సిన మన పత్రికల వారే వార్తల ‘కవరేజ్’ అంటూ చివరకు నలుగురిలో పలచనైపోవడం, నగుబాటుకు గురవడం చాలా బాధగా అనిపించింది. ఉండబట్టలేక, ఈ నాలుగు మాటలూ రాయాల్సి వచ్చింది.

మీడియా మిత్రులు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా... ? ప్రచారం కోసం చూసేవారే ఏకంగా పత్రికా రచనను శాసించే స్థాయికి ఎదగడాన్ని అడ్డుకుంటారా... ? అసలు ఇంతటి దు:స్థితికి మనమెందుకు దిగిపోవాలని ఆత్మవిమర్శ చేసుకుంటారా... ? చెప్పిన మాటను చెప్పలేదంటూ, ఆనక తప్పంతా మీడియాదే అనే అపర సినీ గిరీశాల అసలు కథను జనం కట్టెదుట పెడతారా... ? అక్షరం అమ్ముడు కాదని చూపెడతారా... ? మీడియా గౌరవాన్ని నిలబెడతారా.... ? అన్నీ బేతాళ ప్రశ్నలే.

3 వ్యాఖ్యలు: