జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, March 3, 2012

''నిప్పు'' మీద నెగటివ్ టాక్ - ఆశ్చర్యపరిచే తెర వెనుక కథ




(ఫోటోల వివరం - ''నిప్పు''లో రవితేజ, ''పూల రంగడు''లో సిక్స్ ప్యాక్ లో సునీల్)


రవితేజ హీరోగా నటించగా, ఇటీవల విడుదలైన ''నిప్పు'' సినిమా నేనింకా చూడలేదు. అసలు రిలీజు రోజునే చూద్దామంటే కుదరలేదు. చూద్దామని అనుకుంటుండగానే, సినిమా బాగా లేదంటూ, పత్రికలలో, చానళ్ళలో హోరెత్తించే ప్రచారం సాగింది. ఖాళీ కుదుర్చుకొని, సినిమా చూసేలోగా, హాళ్ళలో ఆ సినిమా దాదాపు అదృశ్యమైంది. ఒకటీ అరా మల్టీప్లెక్సుల్లో ఉన్నా, రోజుకు ఒకటీ, అరా ఆటలే మిగిలాయి. అబ్బ.... ప్రతి సినిమానూ ఆహా, ఓహో అద్భుతం అని ఆకాశానికి ఎత్తేసే మీడియా ఈ సారి ఇంత నిష్కర్షగా ముక్తకంఠంతో చెప్పిన మాట అక్షరాలా నిజంలా ఉందే అని అనుకున్నా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఓ పేరున్న పెద్ద పేపర్ లో సినిమా విడుదలైన మరునాడే నిప్పు బాగా లేదంటూ రివ్యూ కూడా వచ్చేసింది. ఇవన్నీ నాకు ఆశ్చర్యం, మీడియాలో సత్యనిష్ఠ పెరిగిందేమోనన్న ఆనందం కలిగించాయి.

కానీ, ఇందరూ, ముక్తకంఠంతో ఇంతగా సినిమా బాగా లేదని చెప్పడం వెనుక కారణమేమిటా అని నా బుర్రలో ఏదో ఒక మూల గంట కొడుతూనే ఉంది. తీరా ఇవాళే నాకు అదాటున ఓ అద్భుతమైన నిజం తెలిసింది. దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి నిర్మాతగా మారి, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ''నిప్పు'' సినిమా బాగా లేదన్న మాట నిజమే. అయితే, ఆ సినిమా గురించి రిలీజు రోజు సాయంత్రానికే టీవీ చానళ్ళతో సహా మీడియా అంతటా అలా నెగటివ్ ప్రచారం జరగడం వెనుక మరో నిగూఢ రహస్యం ఉంది.

సినీ రంగంలోని ఆంతరంగిక వర్గాలు వెల్లడించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం - ఈ నెగటివ్ టాక్ వెనుక ''పూలరంగడు'' సినిమా ఉంది. అదేమిటని ఆశ్చర్యపోకండి. ఇది పచ్చి నిజమని కృష్ణానగర్ కబురు. ''పూలరంగడు'' సినిమాను రూపొందించిన ఆర్. ఆర్. మూవీ మేకర్స్ వారికీ, హీరో రవితేజకూ ఏదో పాత తగాదాలున్నాయని భోగట్టా. ఆ మధ్య ''మిరపకాయ్'' సినిమా తీసిన రోజుల్లో ఆ చిత్ర నిర్మాతలైన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వారికీ, ఆ చిత్ర హీరో రవితేజకీ ఎక్కడో చెడిందట. అప్పటి నుంచి వారు రవితేజకు ఝలక్ ఇవ్వడానికి అదను కోసం చూస్తున్నారు.

''పూలరంగడు'' చిత్రం వాణిజ్య విజయంపై ప్రగాఢమైన నమ్మకంతో ఉన్న నిర్మాతలు, కావాలనే ''నిప్పు'' ఎప్పుడు రిలీజైతే, అప్పుడే పోటీగా రిలీజ్ చేయాలని పంతం పట్టి కూర్చున్నారు. అందుకు తగ్గట్లే సంక్రాంతికి ''నిప్పు'' రిలీజనగానే, అప్పుడే ''పూలరంగడు'' రిలీజ్ చేయాలని సిద్ధమయ్యారు. తీరా ''నిప్పు'', దాంతో పాటు ''పూల రంగడు'' వాయిదా పడ్డాయి. మహాశివరాత్రి కానుకగా ''నిప్పు'' రిలీజనగానే, ఆ మరునాడే ''పూలరంగడు'' రిలీజ్ పెట్టేశారు.

''నిప్పు'' రిలీజైన రోజునే, ఆ సినిమా గురించి అన్ని టీవీ చానళ్ళలో ఆ సినిమా బాగా లేదంటూ వార్తలు వచ్చేలా ప్రచారం జరిగింది. అప్పట్లో రవితేజతో ''మిరపకాయ్'', ఇప్పుడు సునీల్ తో ''పూలరంగడు'' తీసిన నిర్మాతల ప్రాయోజకత్వంలో ఇలా నెగటివ్ ప్రచారం జోరుగా సాగినట్లు కృష్ణానగర్ కబురు. చిత్రం ఏమిటంటే, అటు వారికీ, ఇటు రవితేజకూ మధ్య తగాదా మాటేమో కానీ, మధ్యలో ''నిప్పు'' నిర్మాత వై.వి.ఎస్. చౌదరి ఇరుక్కుపోయారు.

ఇంకా విచిత్రం ఏమిటంటే - అటు ఆర్.ఆర్. మూవీమేకర్స్ వారి ''పూల రంగడు''కూ, ఇటు బొమ్మరిల్లు వారి ''నిప్పు''కూ పి.ఆర్.ఓ. ఒకరే. డబ్బులు దండిగా తీసుకోవడమే కాక, మీడియాకు కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడనే పేరున్న ఆ అగ్ర పీ.ఆర్.ఓ. ఏకకాలంలో అటూ, ఇటూ కూడా పనిచేస్తూ, ఒక సినిమా వాళ్ళ వ్యక్తిగత కక్ష సాధింపు కోసం మరో సినిమా మీద బురద జల్లనివ్వడం ఆశ్చర్యకరమే కాదు, ప్రొఫెషనల్ ఎథిక్స్ ను కూడా మలినపరిచిన అత్యంత విషాదం కూడా.

ఆర్.ఆర్. మూవీ మేకర్స్ తో అతి సన్నిహిత సంబంధాలు ఉండడం, వారే తన సినిమా ఒక దానికి నిర్మాతలు కావడంతో ఆ ఘనత వహించిన పి.ఆర్.ఓ. గారు ''నిప్పు'' పై దుష్ప్రచారానికి ఆజ్యం పోసి ఊరకున్నట్లు హైదరాబాద్ లో సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇక, ఆ విష ప్రచారాన్ని అడ్డుకొనేందుకు ఆ పి.ఆర్.ఓ. కాదు కదా, కనీసం ఇటు ''నిప్పు'' సినిమా తీసిన బొమ్మరిల్లు అధినేత వై.వి.ఎస్. చౌదరి కూడా గట్టిగా నిలబడలేకపోవడం చేతకానితనం అనుకోవాలా, చేవచచ్చినతనం అనుకోవాలా. అసలే ''నిప్పు'' సినిమాను కొనేవాళ్ళు లేక, సొంతంగా రిలీజు చేసుకొని, కొన్న కొద్ది ఏరియాల వాళ్ళు కూడా డబ్బులు తగ్గించి కట్టడంతో, దెబ్బతిన్న వై.వి.ఎస్. చౌదరికి ఇది దెబ్బ మీద దెబ్బ. మూలిగే నక్క మీద తాటిపండు పడడమంటే ఇదే.

కొసమెరుపు -

ఇదంతా చెప్పింది ''నిప్పు'' సినిమా ఏదో మహత్తర సినిమా అని ఒప్పించడానికి కాదు. ఎంతో మంచి సినిమా ఈ విష ప్రచారం వల్ల దెబ్బతిన్నదని నమ్మించడానికీ కాదు. దురదృష్టవశాత్తూ, మన మీడియా ఇవాళ ఎటుబడితే అటు, ఎలా పడితే అలా ఒంగిపోతూ, పిచ్చివాడి చేతిలో రాయిగా మారిందని తెలియపరచడానికే.

అన్నట్లు, ''నిప్పు'' చిత్రం ఇప్పుడు ఎంత పెద్ద ఫ్లాపంటే, రవితేజ కెరీర్ లోని ''చంటి'', ''షాక్'' లాంటి చిత్రాల కన్నా ఈ సినిమాకు కలెక్షన్లు కనాకష్టంగా వచ్చాయి. అసలు ఓపెనింగులే లేని ''నిప్పు'' రెండో వారం తిరిగే సరికల్లా ఒకటీ అరా మినహా మిగతా హాళ్ళలో కనబడితే ఒట్టు. అలాగే, ఈ సినిమా విడుదల కాకముందే తప్ప, విడుదలయ్యాక సినిమా ప్రచారంలో దర్శకుడు, హీరో కనిపించనే లేదు.

అదేమని ఆరా తీస్తే, ప్రచారానికి రమ్మంటే, అటు హీరో రవితేజ, ఇటు దర్శకుడు గుణశేఖర్ పరుగో పరుగట. రాము గాక రామని చెప్పేశారట. చిత్రం చూశారా... గుణశేఖర్, వై.వి.ఎస్. చౌదరి, రవితేజలు సినీ జీవితం తొలినాళ్ళలో మద్రాసులో రూమ్ మేట్లంటూ సినిమా విడుదల ముందు తెగ చెప్పుకున్నారు. తీరా సినిమా విడుదలయ్యేసరికి, ఆ పాత స్నేహం ఆవిరైపోయినట్లుంది. అవును మరి. అన్ని సంబంధాలూ ఆర్థిక సంబంధాలే అయిన సినీ రంగంలో సక్సెస్ సత్యం, స్నేహాలు మిథ్య. బహుశా, దర్శక - నిర్మాత వై.వి.ఎస్. చౌదరికి ఈ మాట ప్రత్యేకించి చెప్పనక్కరలేదనుకుంటా.

3 వ్యాఖ్యలు:

ijswamy said...

Many Telugu movies of late are bad. Media are paid for favourable review

రవి said...

నిన్నే అప్ప్లల్రాజు అనే సినిమా టీవీలో వచ్చింది. ఆ సినిమా కథలానే ఉంది ఈ వ్యవహారమేదో..

Bendi said...

gossips nammakandi manchi movieni adarinchandi fans gola pakkna pattandi save telugu industry