జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, March 11, 2011

మనవాళ్ళు వట్టి వెధవాయిలోయ్...

రకరకాల పని ఒత్తిళ్ళ మధ్య చాలా రోజులుగా పోస్టులు రాయడానికి వీలు లేకుండా ఉన్న నేను ఈ అర్ధరాత్రి వేళ ఈ పోస్టు మాత్రం రాయకుండా ఉండలేకపోతున్నా. పొద్దుటి నుంచి ఆఫీసులో పని చేసి వచ్చినప్పటి అలసట, బాధలను మించిన బాధ, ఉద్వేగం ఈ పోస్టు రాసేలా చేస్తున్నాయి. బహుశా తెలుగు జాతి చరిత్రలో ఇంతటి దుర్దినాన్ని చూడలేం. ఎక్కడ ఉన్నారు, ఉంటున్నారు, ఉండనున్నారనే ప్రాంతీయ అంశాలకు అతీతంగా తెలుగు వాళ్ళందరికీ వర్తించే బాధ ఇది అని నా నమ్మకం.

ఇవాళ ట్యాంక్ బండ్ మీద జరిగిన దారుణం తాలూకు మానసిక గాయం బహుశా ఇప్పుడే కాదు, బహుశా ఎప్పటికీ మానదేమో. మార్చి 10న మిలియన్ మార్చ్ అని ప్రకటించినప్పటి నుంచి ఇవాళ పొద్దున్న దాకా దాని మీద చెలరేగుతున్న చర్చలు వింటూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నాం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశంతో సంబంధం లేని ఇలాంటి దారుణాన్ని మాత్రం నేనైతే ఊహించలేదు. ఇక్కడ ప్రశ్న రాష్ట్రం సమైక్యంగా ఉండాలా, లేక రెండుగానో, వీలుంటే మూడు గానో, నాలుగు గానో విడిపోవాలా అన్నది కాదు. రాష్ట్రాల సంఖ్యతో సంబంధం లేకుండా మన తెలుగు జాతికి, తెలుగు నేలకూ గౌరవం తెచ్చిన మహోన్నతులకు మనమే ఇంతటి అపచారం చేయడం ఏమిటి?

తెలుగు సాహిత్యానికీ, సంస్కృతికీ, సమాజానికీ వెలుగుదివ్వెలుగా నిలిచిన పెద్దల విగ్రహాలను ధ్వంసం చేయడం ఏ రకమైన సంస్కారం? నన్నయ్య విగ్రహం ధ్వంసం చేయడమెందుకు? తెలుగులో ఆది కవి అయినందుకా? ఎర్రనను అవమానించాల్సింది ఎందుకు? ఆంధ్రమహాభారతాన్ని అందించినందుకా? తెర మీద తారలే లోకంగా బతికే మన తెలుగు జాతికి సంగీతం వద్దు, సాహిత్యం వద్దు. సంస్కృతి అసలే వద్దు. అందుకే, మన ట్యాంక్ బండ్ పై అన్నమయ్య వద్దు. క్షేత్రయ్య వద్దు. మొల్ల వద్దు. కూచిపూడి నాట్యాన్ని అందించిన సిద్ధేంద్ర యోగి అసలే వద్దు. కృష్ణదేవరాయలు, బ్రహ్మనాయుడు, కనీసం రాణి రుద్రమదేవి కూడా వద్దు. నవ యుగ వైతాళికులైన కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి చౌదరి, శ్రీశ్రీ, జాషువాలకు కూడా కుల, మత, ప్రాంతాలను అంటగట్టి, ఈ విద్వేషాలతోనే అంట కాగుదాం.

తెలుగు నాట స్ఫూర్తి దాతలైన వ్యక్తులు అన్ని రంగాల్లో కరవవుతుంటే, ఉన్న ఆ కొందరి స్మృతులను కూడా చెరిపేద్దాం. వేమన నోటికి గుడ్డ కట్టి, సినిమా, రాజకీయ తారాగణమే ఆరాధ్యదైవాలుగా, ఆ సంస్కృతే మన సంస్కృతిగా చంకలు గుద్దుకుందాం. వీలైతే నాదే కులమో, నీదే మతమో, అవతలి వాడిది ఏ ప్రాంతమో తెలుసుకొని, తన్నుకుందాం. ప్రాంతాలకు అతీతంగా వెలుస్తున్న కుహనా రాజకీయ నేతలనే వర్తమాన తరానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా ఐకాన్స్ గా చెప్పుకుందాం.

పక్క రాష్ట్రం వాడికి ప్రాచీన భాషా ప్రతిపత్తి ఇచ్చాడనీ, మనకు రాకుండా అడ్డుకున్నారనీ వేదికలెక్కి భోరున ఏడుద్దాం. అదే నోటితో, అదే చేతితో మన భాషా సంస్కృతులకు దీపధారులైన వారి విగ్రహాలను ధ్వంసం చేద్దాం. అందుకే, నా మటుకు నాకు ఇవాళ హుస్సేన్ సాగర్ లో పడ్డది తెగిపడ్డ విగ్రహాలు కాదు, తెలుగు వాడి (అది ఉత్తర కోస్తా నుంచి ఇటు తెలంగాణ వరకూ ప్రతి ఒక్కరి) ఆత్మగౌరవం. మంట గలిసింది మరేదో కాదు, మన జాతి ప్రతిష్ఠ. సంకుచితమైన భావాలకు అతీతంగా కృషి చేసిన మహామహుల త్యాగం.

ఈ రోజున మన జాతినీ, మన భాషనూ మనమే అగౌరవ పరుచుకున్నందుకు భుజాలు ఎగరేద్దాం. ట్యాంక్ బండ్ బుద్ధుడి సాక్షిగా ఏమీ జరగనట్లే మళ్ళీ రేపు మన పనుల్లో మనం మునిగిపోదాం. ఈ భాష, ఈ జాతి, ఈ సంస్కృతి, ఈ సాహిత్యం ఏమైతే ఎవడికి కావాలి? నా కులం వాడికీ, నా ప్రాంతం వాడికీ మంత్రి పదవో, మరొకటో వస్తే చాలని సంతోషిద్దాం. మనవాళ్ళు వట్టి వెధవాయిలోయ్ అన్న మాట పదే పదే నిజం చేద్దాం.

(వెయ్యేళ్ళ పైచిలుకు తెలుగు సాహితీ, సాంస్కృతిక చరిత్రలో తమ వంతు పాత్ర పోషించిన ప్రతిభామూర్తులందరికీ పేరు పేరునా క్షమాపణలు చెప్పుకుంటూ...)

1 వ్యాఖ్యలు:

prabandhchowdary.pudota said...

Ala chesina mana telangaanhaa sodharula tharapuna nenu koodaa aa mahaanubaavulaku kshamapanalu cheppukuntunnanandi...

Prabandh Pudota.