జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, October 7, 2010

చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది! త్రీ ఛీర్స్ టు త్రివిక్రమ్ ఖలేజా!!గడచిన పదిహేను, ఇరవై రోజుల్లో టీవీలో రెండు హిట్ సినిమాలు కొద్దిగా, కొద్దిగా చూశా. యాదృచ్ఛికంగా రెండూ దర్శక - రచయిత ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్ రూపకల్పనలే. ఒకటి - మహేశ్ బాబు నటించిన ‘అతడు’. రెండోది - పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’. సెలవు రోజున మధ్యాహ్నం పూటో, రాత్రో ఇంటిలోనే ఉండి భోజనం చేస్తున్నప్పుడు టీవీ చానళ్ళు తిప్పడం నాకు అలవాటు. ఇంటిల్లపాదీ కూర్చొని, అన్నం తింటూ, ఆ కాసేపు టీవీ చానల్ ధర్మమా అని ఆ సినిమాలు చూశాము.

నిజానికి, ఆ రెండు సినిమాలూ నేను గతంలో థియేటర్లో చూసినవే, పత్రికల్లో రాసినవే. టీవీలో కూడా అడపా దడపా అదాటున కాసేపు కనిపించినవే. అయినా, సన్నివేశాల్లోని గాఢత నన్ను మరోసారి చూసేలా చేసింది. ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పటికి ఏ పదో సారో అయినా సరే, గుడ్లప్పగించి చూస్తూ, సినిమాలోని సెంటిమెంట్, హాస్యాలను ఆస్వాదించడం గమనించాను.

ఉన్నమాట చెప్పాలంటే, ‘అతడు’ కానీ, ‘జల్సా’ కానీ మొదటిసారి చూస్తున్నప్పుడు ఫరవాలేదు బాగానే ఉన్నాయని అనిపించాయే తప్ప, ‘ఆహా, ఓహో’ అనో, పదే పదే చూసి ఆనందించగలమనో అనిపించలేదు. కానీ, తీరా ఇప్పుడు అందుకు భిన్నమైన అనుభవం ఎదురవుతుండేసరికి, నేను గతుక్కుమన్నాను. నేనే కాదు, నా లాగానే మా ఇంట్లోనూ, బయట చాలా మంది ఆ సినిమాలనూ, అందులోని దృశ్యాలనూ పదే పదే చూసి ఆనందించడం నన్ను ఆలోచనలోకి నెట్టింది.

ఒక సృజనాత్మక కృషి పదే పదే ఆస్వాదయోగ్యం అవుతుండడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ కృషిని ఆ స్థితికి తీసుకువెళ్ళడానికి రూపకర్త పాటించిన పద్ధతి ఏమిటి? దీనికీ ఏదైనా ఫార్ములా ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు.

ఈ ప్రశ్నలకు నాకొచ్చిన సమాధానమేమిటంటే - ఒక సన్నివేశాన్ని ఎన్నో రకాలుగా తెరపై చూపవచ్చు. చూసిన తక్షణమే ప్రేక్షకుడి నరనరాల్లోకీ అది ఎక్కేసేలా, ఒక విధమైన కిక్ వచ్చేలా చిత్రీకరించడం ఒక పద్ధతి. దీని వల్ల ప్రేక్షకుల్ని, ప్రధానంగా మాస్ ను ఆకర్షించవచ్చు. చూడగానే అబ్బో అనిపించవచ్చు. సర్వసాధారణంగా మాస్ చిత్రాల దర్శకులు అనుసరించే పద్ధతి ఇది. కానీ, ఆ ప్రభావం, ఫలితం ఆ క్షణానికే, ఆ కొద్ది రోజులకే. ఆ తరువాత ఆ ఘట్టాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించదు. చూసినా తొలి సందర్శన నాటి కిక్ రాదు.

అలా లౌడ్ గానో, క్రూడ్ గానో కాకుండా అదే ఘట్టాన్ని వివిధ పాత్రల మధ్య సంఘర్షణగా, సున్నితమైన పద్ధతిలో తెరకెక్కించవచ్చు. ఆ రకంగా ఒక సన్నివేశాన్ని సంస్కారవంతమైన ధోరణిలో వేర్వేరు స్తరాలుగా చూపితే కలిగే ప్రభావం దీర్ఘకాలికమైనది. ఆ ఒక్క క్షణానికే కాకుండా, చూసిన ఒక్కొక్కసారీ ఆ సన్నివేశంలోని ఒక్కొక్క పొర ప్రేక్షకుడికి తెలిసి వస్తుంటుంది.

ఆ లోతులు అర్థమవుతున్న కొద్దీ సన్నివేశంలోని గాఢత పెరుగుతుంది. అందుకే, ప్రేక్షకుడికి తెలిసిన ఘట్టమే అయినా, ఆ సన్నివేశాలు చూసినకొద్దీ చూడబుద్ధేస్తుంటాయి. త్రివిక్రమ్ తన చిత్రాల రచనలో, దర్శకత్వంలో ఉపయోగించే విధానం ఇదే. అందుకే, పాత్రలకూ, ప్రేక్షకులకూ మధ్య సమతూకపు డిగ్నిటీని కాపాడే ఆ చిత్రాల్లోని ఘట్టాలు చిరస్మరణీయం కాగలుగుతున్నాయి. అయితే, అలా తీయడానికి దర్శకుడికి అక్షరాలా ఖలేజా కావాలి. త్రివిక్రమ్ కు అది ఉంది.

అందుకే, మొదటి సారి కన్నా రెండోసారి, రెండోసారి కన్నా మూడోసారి - అతని చిత్రాలు బాగుంటాయి. ఒక్క ముక్కలో చెప్పమంటే, త్రివిక్రమ్ సినిమాలు మంచి వైన్ లాంటివి. పాత బడిన కొద్దీ రుచి, విలువ పెరగడం ఫ్రెంచ్ మద్యమైన వైన్ స్వభావం. ఆ లక్షణం త్రివిక్రమ్ రచన, దర్శకత్వాల్లో వచ్చిన అధిక భాగం సినిమాల్లో గమనించవచ్చు. అదే ఆయనను సమకాలీన రచయితలు, దర్శకుల్లో ప్రత్యేక స్థానంలో నిలిపింది.

కావాలంటే, 'అతడు', 'జల్సా' లాంటి సినిమాలు మరోసారి చూడండి. మీరూ నా మాటలతో ఏకీభవిస్తారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడం, చదివిన కొద్దీ చదవాలనిపించడం - ఇదే కదా కాలానికి అతీతంగా నిలిచే ఉత్తమ సృజనకు ప్రాథమిక లక్షణం. త్రీ ఛీర్స్ టు త్రివిక్రమ్.... ఆల్ ది బెస్ట్ టు ఖలేజా!

10 వ్యాఖ్యలు: