-
మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సభలో మాజీ సీఎం
స్వాతంత్ర ్య సమరయోధుడు, ప్రజాసేవనే
పరమార్థంగా భావించిన త్యాగమూర్తి, మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు లాంటి
“నిజాయతీపరులకు ఇవాళ రాజకీయ వ్యవస్థలో చోటు లేకుండా పోయింది. ఎన్నికలనేవి కేవలం
డబ్బుతో ముడిపడిన వ్యవహారంగా మారిపోయాయి” అని సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆఖరి
ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి వాపోయారు. “డబ్బులు తీసుకొని
ఓట్లేస్తున్న ఓటర్లంటే ఎమ్మెల్యేకూ, గెలిచిన దగ్గర నుంచి అవినీతి గురించి ఆలోచించే
ఎమ్మెల్యేలంటే ముఖ్యమంత్రులకూ గౌరవం లేకుండా పోయింది. అలాగే, రెండు
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష దారుణంగా ఉంది. ఆ
పరిస్థితులు మారితేనే, ప్రజాస్వామ్యానికి మనుగడ. లేదంటే, రాజకీయాలన్నా, రాజకీయ
నాయకులన్నా సమాజంలో గౌరవమే లేకుండా పోతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. సీనియర్
రాజకీయ నేత మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని
రవీంద్రభారతిలో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ రాజకీయ
నాయకుడైన తన తండ్రికీ, మండలి వారికీ ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, “మండలి
వంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని, ఈ తరం ముందుకు సాగాల్సిన అవసరం ఉంద”ని కిరణ్‌కుమార్
రెడ్డి ఉద్బోధించారు. ఇవాళ ప్రవేశ పెడుతున్న అనేక రాష్ట్రాల బడ్జెట్‌లలో మౌలిక
వసతుల నిర్మాణానికి చేసే క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ కన్నా ప్రజాకర్షక పథకాలతో పంచే
తాయిలాలకే పెద్ద పీట వేస్తుండడం విషాదమని ఆయన అభిప్రాయపడ్డారు.

మరో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు –
రాజకీయ నేత జలగం ప్రసాదరావు సభలో పాల్గొంటూ, “అత్యంత
భయానకమైన 1977 నాటి దివిసీమ ఉప్పెన సమయంలో మా నాన్న గారికి క్యాబినెట్ సహచరుడైన
మండలి వెంకట కృష్ణారావు ఆ ప్రాంతాన్ని తిరిగి నిలబెట్టడం కోసం సాగించిన నిస్వార్థ
సేవను మరిచిపోలేం” అని జ్ఞాపకం చేసుకున్నారు. మంత్రిగా కారు సౌకర్యం ఉన్నా అది
వద్దని, సామాన్యులతో కలసి బస్సులో ప్రయాణిస్తూ మండలి వారు చూపిన నిరాడంబరత, గడిపిన
ఆదర్శ జీవనాన్ని ప్రస్తావించారు. మూడున్నర దశాబ్దాల పైగా నాటక రంగానికి విశేష కృషి
చేస్తున్న ప్రముఖ రంగస్థల సంస్థ ‘రసరంజని’ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు తెలంగాణ
ప్రభుత్వ పూర్వ సలహాదారు, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి డాక్టర్ కె.వి. రమణాచారి
అధ్యక్షత వహించారు. తొలిసారిగా ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ నిర్వహించడమే కాక, తెలుగు
భాషా సంస్కృతుల వికాసం కోసం ఆఖరివరకు శ్రమించిన మండలి వారి సామాజిక, సాంస్కృతిక
సేవలను రమణాచారి సహా హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి గ్రంథి భవానీ ప్రసాద్, ఆచార్య
కొలకలూరి ఇనాక్, సినీ – నాటక రచయిత, నటుడు
తనికెళ్ళ భరణి, తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడు – కవి గోరటి వెంకన్న, మాజీ
ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, తదితర అతిథులు స్మరించారు.
జలగం వెంగళరావు సీఎంగా ఉండగా 1975 ఏప్రిల్‌లో
హైదరాబాద్‌లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న మండలి
వెంకట కృష్ణారావు అహరహం శ్రమిస్తే... కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా 2012
డిసెంబర్‌లో తిరుపతిలో జరిగిన నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు
మండలి వారి కుమారుడు మండలి బుద్ధ ప్రసాద్ త్రికరణశుద్ధిగా కృషి చేశారని మాజీ సీఎం
కిరణ్ కుమార్ రెడ్డి, రమణాచారి ప్రభృతులు ఆత్మీయంగా ఆ సంగతులను సభికులతో
పంచుకున్నారు. మండలి బుద్ధ ప్రసాద్, ఆయన కుమారుడు రాజా సహా పలువురు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, రాజకీయ
నాయకులు, రంగస్థల అభిమానులు సభలో పాల్గొన్నారు.
శత జయంతి సభానంతరం డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్
రచించగా, గంగోత్రి సాయి దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్ర పోషించిన ‘మహాపురుషుడు... మండలి’ నాటక
ప్రదర్శన రెండు గంటలకు పైగా అద్భుతంగా సాగింది. మండలి వెంకట కృష్ణారావు ఆదర్శ
రాజకీయ, సేవా జీవితాన్ని ప్రేక్షకులను కదలకుండా చూసేలా చేసింది. ఆ అపూర్వ ప్రదర్శన
ఆద్యంతం చూసి, నట – రచయిత తనికెళ్ళ భరణి, సినీ దర్శకుడు శివనాగేశ్వరరావు సహా పలువురు ఆత్మీయంగా
స్పందించడం విశేషం.
- రెంటాల జయదేవ
0 వ్యాఖ్యలు:
Post a Comment