జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, November 14, 2015

సకలం... అఖిలం ('అఖిల్' మూవీ రివ్యూ)

సకలం... అఖిలం

చిత్రం: ‘అఖిల్... ది పవర్ ఆఫ్ జువా’; కథ: వెలుగొండ శ్రీనివాస్; 
మాటలు: కోన వెంకట్; సంగీతం: తమన్, అనూప్; 
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాశ్; కెమేరా: అమోల్ రాథోడ్; 
యాక్షన్: కె. రవివర్మ; ఎడిటింగ్: గౌతంరాజు; 
నిర్మాతలు: ఎన్. సుధాకరరెడ్డి, నితిన్, 
దర్శకత్వం: వి.వి. వినాయక్; నిడివి: 130 ని

అఖిల్ ఎవరో సినీ ప్రియులకు ప్రత్యేకించి చెప్పనక్క ర్లేదు. కానీ, 
లాంఛనంగా చెప్పాలి కాబట్టి... అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన 
కొత్త వారసుడు. నాగార్జున, అమల దంపతుల కుమారుడు. తన పేరే 
టైటిల్‌గా తయారైన సినిమాతో తొలిసారిగా పూర్తిస్థాయి హీరోగా ప్రేక్షకుల 
ముందుకొ చ్చాడు. దసరాకు రావాల్సి ఉన్నా, ‘‘గేమ్ ఎప్పుడైనా గెలుపు 
నాదే’’ అంటూ, దీపావళికొచ్చాడు. ఇప్పటికే తాత, తండ్రి, అన్నలతో 
పరిచయమున్న సినీ ప్రియులకు తెరపై కొత్త బాణసంచా అఖిల్. 
హీరోగా అతను ఎంచుకున్న కథ, సినిమా కూడా అచ్చమైన దీపావళి టపాకాయ.

 కథగా చెప్పాలంటే... అఖిల్ (అఖిల్) అమ్మానాన్న లేని కుర్రాడు. 
ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా తిరుగుతూ, ఫైటింగ్ పోటీల్లో పాల్గొని గెలుస్తూ 
డబ్బులు సంపాదిస్తుంటాడు. దివ్య (సాయేషా)ని తొలిచూపులోనే
 ప్రేమిస్తాడు. బాగా చదువుకొన్న దివ్యకు మూగ జీవాలంటే మహా ప్రేమ. 
ఎంత ప్రేమంటే, తన దగ్గరున్న కుందేలుకు గుండెలో రంధ్రముందని తెలిసి, 
బాగు చేయాలనుకొనేంత ప్రేమ. వెంటనే హీరో కేంబ్రిడ్జ్‌లో చదువుకొన్న
 వెటర్నరీ డాక్టర్‌నని నాటకమాడతాడు. నిజానికి హీరోయిన్ ఒక పెద్ద
 మాఫియా వ్యాపారి (మహేశ్ మంజ్రేకర్) కూతురు. అప్పటికే ఆమెకు
 మరొకరి (‘వెన్నెల’ కిశోర్)తో పెళ్ళి నిశ్చయమవుతుంది. ఆ పెళ్ళిని 
తెలివిగా చెడగొడతాడు హీరో.

పారిపోయి, వేరే ప్రేమ వివాహం చేసుకున్న ఆ పెళ్ళికొడుకునూ, 
పెళ్ళి చెడగొట్టిన అతని ఫ్రెండ్‌నూ వెతుక్కుంటూ, పగ తీర్చుకొనే 
పనిలో పడుతుంది హీరోయిన్. చదువుకుంటానని పైకి చెబుతూ,
 పగ తీర్చుకోవడానికి యూరప్ వెళుతుంది. హీరోయిన్‌నీ, ఆమె 
నుంచి ప్రేమనూ పొందడానికి హీరో రెండు లక్షలతో యూరప్‌కి 
చేరతాడు. అక్కడ అనుకోకుండా, ఒక ఆఫ్రికన్ కుర్రాడి బుల్లెట్
 గాయానికి చికిత్స చేస్తుంది హీరోయిన్. గూండాల వేటలో ఆ 
కుర్రాడు చనిపోతాడు. అప్పటి దాకా ఆ ఆఫ్రికన్ కుర్రాడి కోసం, 
అతను దాచిన రహస్యం కోసం వెతుకుతున్న గూండాలు విషయాలన్నీ
 హీరోయిన్‌కు తెలుసని ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఆఫ్రికా పట్టుకుపోతారు.

ఈ ఆఫ్రికా ట్విస్ట్ వెనుక అసలు కథ మరొకటి ఉంటుంది. అదేమిటంటే, 
సూర్యతాపం నుంచి ప్రపంచ వినాశం జరగకుండా కాపాడే సూర్యకవచం
 ఆఫ్రికాలో ఒక తెగ వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రతి సూర్యగ్రహణం నాడూ 
గ్రహణం విడిచిన వెంటనే సూర్యుడి తొలి కిరణాలు దాని మీద పడాలి. 
లేకపోతే ప్రపంచ నాశనం తప్పదు. స్థానిక ఆఫ్రికన్లు తమ భాషలో 
ఆ కవచాన్ని ‘జువా’ (అంటే సూర్యుడని అర్థం) అంటూ ఉంటారు. 
దాన్ని ఎలాగైనా చేజిక్కించుకొని, ప్రపంచాన్ని తన పాదాక్రాంతం 
చేసుకోవాలని ఒక రష్యన్ శాస్త్రవేత్త ప్రయత్నిస్తుంటాడు. ఆ ‘జువా’ను 
తెచ్చి ఇవ్వడానికి మాఫియా వ్యాపారి అయిన హీరోయిన్ 
నాన్న (మహేశ్ మంజ్రేకర్) ఒప్పుకుంటాడు. గూండాల 
సాయం తీసుకుంటాడు. వాళ్ళకు అది దొరకకుండా చేస్తాడు
 ఆ ఆఫ్రికా కుర్రాడు. ఆ జువాను ఒకచోట దాస్తాడు. తీరా
 గూండాల చేతిలో చనిపోయాడన్న మాట.   

హీరోయిన్‌ను వెతుకుతూ ఆఫ్రికా వెళ్ళిన హీరోకు ఈ కథంతా 
తెలుస్తుంది. హీరోయిన్‌ని కాపాడి, ఆ జువాను తీసుకురావడానికి 
తానే బయల్దేరతాడు. ఆ తరువాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు
 ఎవరైనా ఊహించుకోగలిగినదే. కాకపోతే, అఖిల్ ఆ పనెలా చేశాడు,
 ఏ జీవాన్నైనా పీక్కు తినే కిల్లర్ ఫిష్‌లతో నిండిన ఆ కొలనులో ఏమైంది, 
జీపుతో గాలిలోకి ఎగిరి మరీ నడుస్తున్న విమానాన్ని హీరో ఎలా 
అందుకున్నాడు, ఆ మంటల్లో నుంచి ఎలా బయటపడ్డాడు, 
చివరికి ఆ సూర్యగ్రహణానికి ఏమైందన్నది వి.వి. వినాయక్ 
మార్కు ‘అఖిల్’లో తెరపై చూసి తీరాలి.

అమృతతుల్యమైనవీ, ప్రపంచ నాశనం నుంచి కాపాడేవీ
 అయిన ఆత్మలింగం (చిరంజీవి ‘అంజి’), మహాశక్తి (వెంకటేశ్ ‘దేవీపుత్రుడు’),
 శక్తి (చిన్న ఎన్టీయార్ ‘శక్తి’) లాంటివి గతంలో చూశాం. 
ఈసారి సూర్యకవచం తెర మీదకొచ్చింది. కొన్నేళ్ళ క్రితం 
నాగార్జునకు ‘డమరుకం’ సినిమా కథ ఇచ్చిన రచయితే 
దీనికీ కథారచన. కోన వెంకట్ మార్కు డైలాగ్స్ అదనం. 
హీరోగా తొలి సినిమా అనిపించకుండా అఖిల్ ఈజ్ చూపారు. 
ఫైట్స్, డాన్‌‌స, కాస్ట్యూమ్స్‌లో మార్కులు కొట్టేస్తారు. రూపురేఖల్లో 
అచ్చం బాలీవుడ్ నటుడనిపిస్తారు. కొత్తమ్మాయి సాయేషా 
(దిలీప్‌కుమార్, సైరాబాను దంపతులకు మనవరాలి వరస) 
కూడా డిటో డిటో. ‘వెన్నెల’ కిశోర్, జాన్సన్ అండ్ జాన్సన్‌గా
 సెకండాఫ్‌లో బ్రహ్మానందం, ఒక్క సీన్ ‘పోతే బాబూరావు’గా 
సప్తగిరి.. ఉన్న కథలోనే కామిక్ రిలీఫ్. కథలో కాసేపటి
 తర్వాత కనిపిం చని రాజేంద్రప్రసాద్ బృందమూ అంతే.

మిస్సవకుండా మొదటి నుంచీ చూడాల్సిన సినిమా ఇది.
 ఎందుకంటే, టైటిల్స్ పడుతున్నప్పుడే ‘జువా’ అంటే ఏమిటో, 
అదెందుకు కీలకమో - మొత్తం చెప్పేస్తారు. ఫారిన్ షూటింగ్‌లు, 
పాటల చిత్రీకరణల్లో నిర్మాణ విలువలు కనిపించే ఈ సినిమాలో 
కెమేరా వర్క్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆఫ్రికా గూడెం మొత్తం
 ఇక్కడ మన ఆర్ట్ డెరైక్టర్ ప్రతిభేనంటే నమ్మబుద్ధి కాదు. 
రవి వర్మ యాక్షన్ కంపోజింగ్ బాగుంది. ఇన్నీ ఉన్నా, 
ఒక్క ముక్కలో ఈ సినిమా ‘ఫర్ ది అఖిల్... బై ది అఖిల్... 
అండ్ టు ది అఖిల్’. మొత్తం ఆ హీరో భుజాల మీద, ఆ 
పాత్ర చేతుల మీదుగా నడుస్తుంది. ఏ హీరో అయినా తన 
తొలి సినిమాకు అంతకు మించి ఏం కోరుకుంటాడు!
 ప్రేక్షకులు ఇంకేం ఆశిస్తారు!

......................................
- అఖిల్‌కు సన్నిహిత మిత్రుడైన మరో సినీ హీరో నితిన్ ఈ సినిమాను నిర్మించారు. 
-  ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవా నికి హీరో హీరోయిన్లని పరిచయం చేశారు.
- స్పెయిన్ లాంటి చోట్ల భారీ షెడ్యూల్స్ చేశారు. ఫైట్లు తీశారు.  
- ఈ సినిమాకు మ్యూజిక్ డెరైక్టర్‌గా అనూప్‌ను తీసుకున్నారు. తరువాత తమన్ 
కూడా మ్యూజిక్‌బాధ్యతలు పంచుకున్నారు. 
- ‘అక్కినేని...’ అంటూ సినిమా చివరలో వచ్చే పాటలో నాగార్జున కూడా
 స్పెషల్ అప్పీయరెన్‌‌స ఇచ్చారు. కుమారుడు అఖిల్ కోసం కలసి, స్టెప్పులు వేశారు.
.................................................

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 13th Nov 2015, Friday, Family Page)
.......................................

0 వ్యాఖ్యలు: