జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, February 21, 2015

సెంటిమెంట్ల చిన్నయ్య - రామానాయుడు

సెంటిమెంట్ల చిన్నయ్య
వెండితెర మీదే కాదు... వ్యక్తిగతంగానూ రామానాయుడికి సెంటిమెంట్ ఎక్కువ. అవతలి వారి కష్టాన్ని తన కష్టంగా తీసుకొనే భావోద్వేగ తత్త్వం మొదలు ఏదైనా పని చేసేటప్పుడు ముహూర్తాల కోసం వేచి చూసే నమ్మకాల దాకా అన్నీ ఉన్న పాత తరం పల్లెటూరి పెద్దమనిషి తనం ఆయనది. రామానాయుడి చిత్రమైన అలవాట్లు, నమ్మకాలలో కొన్ని...

- రామానాయుడు చాలా సెన్సిటివ్. కృత్రిమమైన ప్రవర్తనలు ఎక్కువగా కనిపించే ఈ గ్లామర్ ప్రపంచంలో ఇన్ని దశాబ్దాలుగా ఉంటున్నా, ఆయన గుండెలోని తడి ఇంకిపోలేదు. మనసును బాధించే విషయాలు విన్నా, సంఘటనలు చూసినా ఆయన తట్టుకోలేరు. అప్రయత్నంగానే ఆయనకు కన్నీళ్ళు వచ్చేస్తాయి.

- రామానాయుడికి సెంటిమెంట్లు ఎక్కువ. నిర్మాతగా మద్రాసులో తొలిరోజులు గడిపిన రామానాయుడికి రాహుకాలాలు, వారాలు, వర్జ్యాల పట్టింపులున్నాయి. రాహుకాలంలో ఆయన కథలు వినరు. కీలకమైన నిర్ణయాలు తీసుకోరు. అలాగే, మంగళవారాలు ప్రయాణం చేయకపోవడమనేది ఆయనకున్న మరో నమ్మకం.

 - అందుకే, ఏ పని చెయ్యాలన్నా పండితులతో మంచి ముహూర్తం నిర్ణయించుకుంటారు. అలాగని, గాలిలో దీపం పెట్టి, దేవుడా... అంతా నీదే భారమనే తరహా వ్యక్తి కాదాయన. మంచి ముహూర్తంలో పని ప్రారంభించడం వరకే కానీ, ఆ తరువాత కూడా చేసే పని నిజాయతీగా, నిబద్ధతతో చేస్తారు.

- రామానాయుడికి దైవభక్తి ఎక్కువ. ఆయన ఇంటి ఆరాధ్యదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి. వెంకన్నంటే ఆయనకు అపారమైన గురి. అందుకే, నిర్మాతగా తాను తీసిన ఏ సినిమా అయినా సరే విడుదల కన్నా ముందే రీలు పెట్టెలు తీసుకువెళ్ళి, తిరుమల వెంకన్న దగ్గర పూజలు చేయించడం రామానాయుడి అలవాటు. అలాగే, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బలంగా ఉన్న 1960ల నాటి నుంచి రిలీజ్ రోజున విజయవాడకు వచ్చి, జనం మధ్య కూర్చొని సినిమా చూడడం, ప్రేక్షకుల నాడి గమనించడం ఆయన చాలా కాలం కొనసాగించిన సెంటిమెంట్.

- అలాగే, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రామానాయుడు స్టూడియోస్ కట్టాక, స్టూడియో ప్రాంగణంలోకి ప్రవేశిస్తుండగానే మొదట్లోనే ఎత్తై గుట్ట మీద దేవుడి గుడి కట్టించారాయన. రోజూ ఉదయం స్టూడియోకు వస్తూనే, ఆలయానికి వెళ్ళి, దైవదర్శనం చేసుకొన్న తరువాతనే ఆఫీసులోకి అడుగుపెట్టడం ఆయన నిత్యకృత్యం.  

 -  హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలోనూ స్టూడియో కట్టాక, రోజూ సాయంత్రం వేళ అక్కడకు కారులో వెళ్ళడం, కాసేపు కాలక్షేపం చేసి, అక్కడ ఖాళీ జాగాలో పండించిన కూరగాయలు వగైరా చూసి రావడం ఆయనకు అలవాటు.

 - అలాగే, ‘నాయుడి గారి హస్తవాసి చాలా మంచిది’ అని సినీ పరిశ్రమలో ఒక నమ్మకం. అలాగే, దర్శకుడు దాసరిది కూడా! అందుకే, ఆయన చేతుల మీదుగా డబ్బు తీసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన తన వద్దకు వచ్చి, శుభాకాంక్షలు చెప్పే సినీ టెక్నీషియన్లు ప్రతి ఒక్కరికీ వంద రూపాయల నోటు ఇవ్వడం రామానాయుడు అలవాటు. ఆయన చేతి మీదుగా ఏడాది తొలిరోజు డబ్బు తీసుకుంటే, ఆ ఏడాది పొడుగూతా ప్రతి రోజూ సంపాదన ఉంటుందని చాలామంది నమ్మకం. రామానాయుడు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఈ 2015 జనవరి 1న కూడా ఆ నమ్మకం, అలవాటు అలాగే కొనసాగింది. రెండు గంటల పాటు స్టూడియోకు వచ్చి కూర్చున్న రామానాయుడు ఆ ఆనవాయితీని కొనసాగించారు.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 19th Feb 2014, Thursday)
...................................

0 వ్యాఖ్యలు: