జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, July 26, 2014

సినిమా రివ్యూ: అల్లుడు శీను --- అవే కథలు, పాత్రలతో ఎంతకాలమీ గిల్లుడు?

 ..........................
 చిత్రం - అల్లుడు శీను, తారాగణం - బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, రవిబాబు, రఘుబాబు, కథ - కె.ఎస్. రవీంద్ర, కోన వెంకట్, మాటలు - కోన వెంకట్, రచన - గోపీ మోహన్, ఛాయాగ్రహణం - ఛోటా కె. నాయుడు, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్ - గౌతంరాజు, సమర్పణ - బెల్లంకొండ సురేశ్, నిర్మాత - బెల్లంకొండ గణేశ్‌బాబు, స్క్రీన్‌ప్లే - దర్శకత్వం - వి.వి. వినాయక్
 ..........................

 చిత్ర నిర్మాణానికి ఏం కావాలి? అవసరమైన డబ్బా... అందుబాటులో అగ్రశ్రేణి తారాగణం - సాంకేతిక నిపుణులా... వాణిజ్యపరంగా విజయం సాధించాలనే కోరికా..? దీనికి సమాధానం చెప్పడం కొంత కష్టమే. పైవన్నీ ఉంటే, సినిమా తీయగలరని నమ్మకంగా చెప్పవచ్చేమో కానీ, తీసిన సినిమా బాగుంటుందన్న నమ్మకం మాత్రం చెప్పలేం. ఇంట్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న కుర్రాడు ఉన్నాడు, చేతిలో డబ్బు, పరిశ్రమలో కావాల్సినంత అనుభవం ఉంది కదా అని, అన్నిటికీ కలిసొస్తుందని అతణ్ణి హీరో చేద్దామంటే కుదిరేపని కాదు. డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు పెట్టినా, కథలో, కథనంలో దమ్ము లేకపోతే శ్రమ నిష్ఫలమవుతుంది. ‘అల్లుడు శీను’కు జరిగింది అదే. 

 కథ ఏమిటంటే...

  కర్ణాటకలోని బాదామిలో అనాథగా దొరికిన శీనును ‘అల్లుడు శీను’ (బెల్లంకొండ శ్రీనివాస్)గా పెంచుకొంటాడు నరసింహ (ప్రకాశ్‌రాజ్). ఊరందరికీ అప్పులున్న ఈ మామా అల్లుళ్ళు ఓ రాత్రి అక్కడ నుంచి పారిపోయి, చెన్నై అనుకొని హైదరాబాద్ చేరతారు. అక్కడ ఓ అందమైన అమ్మాయి అంజలి (సమంత)ను చూసి, హీరో ప్రేమలో పడతాడు. తీరా ఆ ఊళ్ళో అన్ని రకాల సెటిల్మెంటు చేసే భాయ్ (మరో ప్రకాశ్‌రాజ్) కూతురే ఆ అమ్మాయని తెలుస్తుంది. మల్టీ మిలియనీర్‌నని అబద్ధమాడి, ఆమె పరీక్షలన్నీ తట్టుకొని, ప్రేమను అందుకుంటాడు. తీరా భాయ్ ఆమె చిన్నాన్నే తప్ప, అసలు తండ్రి కాదనీ, తనను పెంచిన నరసింహే ఆమె అసలు తండ్రి అనీ హీరో తెలుసుకుంటాడు. అసలు ఆమె జీవితంలో జరిగిందేమిటి? వేరే మాఫియా డాన్ కొడుకుతో షార్జాలో పెళ్ళికి సిద్ధమైన ఆమెను అసలు తండ్రి దగ్గరకు హీరో ఎలా చేర్చాడు? ఆమె చేతిని తానెలా అందుకున్నాడన్నది మిగతా సినిమా.

 ఎలా ఉందంటే...

  కథకు ఇద్దరు, మాటలకు ఒకరు, రచనకు మూడో వ్యక్తి రచయితలుగా పనిచేయగా, స్క్రీన్‌ప్లే క్రెడిట్ దర్శకుడు తీసుకున్న సినిమా ఇది. తీరా కథ మాత్రం దాదాపు కొన్నేళ్ళుగా తెలుగు ప్రేక్షకులు చూసి విసుగెత్తిన భాయ్ నేపథ్యం, వేరొకరితో హీరోయిన్ పెళ్ళి కుదిరితే హీరో ఆ పెళ్ళివారింటికే వెళ్ళి, వాళ్ళను బురిడీ కొట్టించి, తాను ఆమెను చేసుకోవడం! (ఆమె తండ్రిని ఆమెతో కలపడం, ఊళ్ళో ఫ్లోరోసిస్ బాధితులకు తోడ్పడే ప్లాంట్ వ్యవహారం లాంటివన్నీ కథకు కొత్త రూపమివ్వడానికి బలవంతాన పూసిన పై పూతలు). ‘ఢీ’ రోజుల నుంచి ఇటీవలి దాకా తెరపై చివికిపోయిన ఈ శ్రీను వైట్ల చిత్రాల మార్కు ప్రధాన కథ, వినోదాన్నే పాతిక కోట్ల పైగా ఖర్చుతో మరోసారి వండి వడ్డించడం సగటు ప్రేక్షకులకు లేని, దర్శక, నిర్మాతలు, రచయితలకు ఉన్న బాక్సాఫీస్ గుండె ధైర్యానికి గుర్తు! 

  నీటిలో కబడ్డీ ఘట్టంతో ఆసక్తిగా మొదలయ్యే సినిమా అరగంట గడిచేసరికి ఏ దోవలో వెళుతోందో అర్థమైపోతుంది. సస్పెన్స్‌లు, సుదీర్ఘమైన ఫ్లాష్‌బ్యాక్‌లు లేకుండా ప్రతి కాసేపటికో ట్విస్టు చొప్పున కథను నడిపించారు కానీ, అవి ఆఖరుదాకా ఆసక్తిని మిగల్చవు. ద్వితీయార్ధంలో కథ షార్జాకు మారాక విలన్లను హీరో వట్టి ‘బకరా’లను చేసే ఘట్టాలు రొటీనే. పైగా, పాత్రల ప్రవర్తనలో, సన్నివేశాల్లో లాజిక్‌లు పూజ్యం. హీరోను ప్రేమించాననడానికి పానీపురీ, పుచ్చకాయ తినడం, ఆటో ప్రయాణం, గాజుల కొనుగోలు లాంటి సిల్లీ పరీక్షలు పెట్టే హీరోయిన్, తీరా మరో మాఫియా నేత కొడుకుతో పెళ్ళికి నిరభ్యంతరంగా ఎలా సిద్ధపడుతుందో అర్థం కాదు. ప్రకాశ్‌రాజ్ పోషించిన నరసింహ పాత్రను కాసేపు అమాయకుడున్నట్లు, ఫ్లాష్‌బ్యాక్‌లో, చివరా మాత్రం ఆలోచనాపరుడు, త్యాగి అన్నట్లు చూపారు. 


ఇక, అంత లావు మాఫియా నేతలు, వారి అనుచరులు సైతం హీరో వేసే చిన్న ట్రిక్కులకు పడిపోయిన బలహీనులన్నట్లు చూపడం సినిమాటిక్ కన్వీనియెన్సే! దర్శకుడు ఎలా కావాలనుకుంటే అలా కథలో పురోగతి వచ్చేస్తుంటుంది. విమానాశ్రయంలో ఛేజ్‌తో దాదాపు సినిమా అయిపోయిన భావన కలుగుతుంది. ‘అల్లుడూ శీనూ! నువ్వొస్తే సూపర్‌హిట్టే ప్రతి సీనూ’ అంటూ ఆ తరువాత టైటిల్ సాంగ్ వచ్చేసరికే జనానికి కుర్చీలో కూర్చొనే సహనం లేకపోతే ఆశ్చర్యమేమీ లేదు. అటు పైన మళ్ళీ క్లైమాక్స్!

 ఎలా నటించారంటే...

  కథ -కథనాల సంగతి పక్కన పెడితే, తొలి పరిచయమనే భావన కలగనివ్వకుండా శ్రీనివాస్ డ్యాన్సులు, ఫైట్లు బాగానే చేశారు. కానీ, సన్నివేశాన్ని బట్టి హావభావాలు పలికించే అభినయ ప్రతిభ లాంటివన్నీ ఈ కొత్త ముఖం నుంచి ఆశిస్తే, అది దురాశే. అందుకు అవకాశమున్న సీన్లు కూడా స్క్రిప్టులో లేవన్నది వేరే కథ. ఆర్థిక అండదండలున్నా, ఆంగికం, వాచికాలను మరికొంత మెరుగుపరుచుకోవడం శ్రీనివాస్‌కు భవితకు శ్రీరామరక్ష. అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఈ కొత్త హీరో పక్కన నటించిన సమంత ఎప్పటిలానే తన అందాన్నీ, అభినయాన్నీ ప్రదర్శించారు. 

నరసింహగా, భాయ్‌గా ప్రకాశ్‌రాజ్‌ది ద్విపాత్రాభినయం. ఇప్పటికే, ఓ రొటీన్ నటన అలవాటైన ఆయన ఆ పరిధిలోనే కన్నకూతురు మీద ప్రేమ చూపే ఘట్టాల్లోనూ కనిపించేస్తారు. హాస్యం కోసమని భాయ్ దగ్గర పనిచేసే డింపుల్‌గా బ్రహ్మానందం, ఇంకా రవిబాబు, రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్ లాంటి చాలామందిని సినిమాలో పెట్టారు. బ్రహ్మానందం పాత్ర కొన్నిచోట్ల, ముఖ్యంగా ద్వితీయార్ధం చివరలో ‘ఇరికిస్తాన్’ మాటలతో కొంత నవ్విస్తుంది. ఇక, గ్రహాలు, జాతకాల పిచ్చిలో తిరిగే విలన్ భానూ భాయ్‌గా ప్రదీప్ రావత్ ఎదురవుతారు. చిత్ర ప్రారంభంలోనే ‘నా ఇంటి పేరు సిల్కు... నా ఒంటి రంగు మిల్కు’ అని ప్రత్యేక నృత్య గీతంలో ప్రముఖ హీరోయిన్ తమన్నా తళుక్కున మెరుస్తారు. 

 బాక్సాఫీస్ కొలతల్లో కథనం 

  సాంకేతిక నిపుణుల సంగతికొస్తే, ఛోటా కె. నాయుడు ఛాయాగ్రహణం బాగుంది. డ్యాన్స్, ఫైట్స్ విభాగాల్లో బాగానే శ్రమించారు. దేవిశ్రీప్రసాద్ మాస్ బాణీలకే పీట వేశారు. ద్వితీయార్ధంలో ‘నీ నీలి కన్నుల్లోన నను కట్టేశావే...’ పాట వినడానికీ, చూడడానికీ బాగుంది. అయితే, నిశ్శబ్దం కూడా సన్నివేశంలోని గాఢతను పెంచుతుందన్న విషయం విస్మరించి, ప్రతి సీన్‌కూ ఆయన తన రీరికార్డింగ్‌తో చెవులకు మోత మోగించారు. చాలా సినిమా తీసినా, చివరకు కొంతే తెరపై మిగిలిందన్న సంగతి ద్వితీయార్ధంలో జంప్ కట్‌ల మధ్య తెలిసిపోతుంటుంది. దర్శకుడిగా వినాయక్ మార్కు దృశ్యాలు సినిమాలో ఉన్నా, వాటికి ఒకప్పటి వాడి, వేడి లేవేమిటనిపిస్తుంటుంది. 

  వెరసి, బొత్తిగా బాక్సాఫీస్ ఫార్ములా కొలతలు వేసుకొని మరీ ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది. ప్రతి పావుగంట - ఇరవై నిమిషాలకో పాట... డ్యాన్సు... మధ్య మధ్యలో ఫైట్లు... లేని హాస్యంతో రాని నవ్వును తెప్పించేందుకు విపరీత ప్రయత్నం... కాసిన్ని డైలాగ్ విసుర్లు... వీటితో ఈ అతుకుల బొంతను ఉన్నంతలో అందంగా కుట్టాలని ప్రయత్నించారు. కానీ, దాని వల్ల సినిమా అంతా ఏ ముక్కకు ఆ ముక్కగా వెళ్ళిపోతుంటుందే తప్ప, ఒక సంపూర్ణ సినీ సందర్శన అనుభవాన్ని అందించదు. పాటలు, ఫైట్లు, ఛేజ్‌ల లాంటివి సామాన్య ప్రజానీకాన్ని ఆకట్టుకొనేవే అయినా, మనసుకు పట్టే పాత్ర చిత్రణ కానీ, కనీసం కన్విన్సింగ్‌గా అనిపించే సన్నివేశాలు కానీ లేకపోవడంతో ఈ అల్లుడి గిల్లుడును ఆసాంతం భరించడం కష్టమే. వెరసి, ఖర్చుకు వెనుకాడని నిర్మాత... అతి భారీ తారాగణం... అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు... హోరెత్తిస్తున్న ప్రచారం... ఇలా అన్నీ ఉన్నా, ‘అల్లుడు...’ ఆహా ఓహో అని తమ నోట అనడానికి సిటీ జనం మొహమాటపడతారు. అందుకే, ఈ సినిమా ఆశలన్నీ బి, సి సెంటర్ల మీదే! 

- రెంటాల జయదేవ

 ............
 బలాలు - 1. అగ్రశ్రేణి తారాగణం, సమర్థులైన సాంకేతిక నిపుణులు 2. తొలి చిత్రమనిపించని హీరో డ్యాన్సులు, ఫైట్లు 3. అక్కడక్కడ విరిసిన హాస్యపు జల్లులు

 బలహీనతలు - 1. అనేక చిత్రాల్లో చూసేసిన కథ 2. బాక్సాఫీస్ కొలతలతో ఒకే లెక్కలో సాగే, బొత్తిగా అనాసక్తికరమైన కథనం 3. బలహీనమైన విలన్ పాత్రలు 4. దర్శకుడు అనుకున్నట్టల్లా స్థిరత్వం లేకుండా మారే పాత్రల స్వభావం, సన్నివేశాలు 5. ఎడిటింగ్, రీ-రికార్డింగ్.
..............


(Published in 'Sakshi' daily, 26th July 2014, Saturday)
........................................................

0 వ్యాఖ్యలు: