జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, February 6, 2013

తొలి పూర్తి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద'కు 81 ఏళ్లు నిండాయోచ్...
టాకీల ఆవిర్భావంతో సినిమా ఎవరూ ఊహించనంత మార్పులకు లోనయింది. ఆంగ్లో ఇండియన్లు, 'మూకీ మహారాజులు'గా వెలుగొందిన ఎంతోమంది టాకీల రాకతో క్రమేపీ తమ ప్రాభవాన్నీ, ప్రతిష్టనూ కోల్పోయారు. అప్పటివరకూ భాషాబేధాలు లేకుండా అందరినీ సమానంగా అలరించిన సినిమా ప్రేక్షకుల మ«ధ్య కొత్త గోడల్ని ఏర్పరచింది. దీని ప్రభావం వల్ల ఎవరికి వారు తమ భాషలోనే చలనచిత్రాలు ఉండాలన్న కోరికను వ్యక్తం చేయసాగారు. మిగిలిన వారి సంగతి అలా ఉంచితే మనదేశంలో టాకీల నిర్మాణం ప్రారంభం కాగానే తెలుగులో కూడా టాకీ చిత్రం రావాలనీ, భారతీయచలనచిత్ర చరిత్రలో తెలుగు సినిమాకు సముచిత స్థానం లభించాలనీ కలలు కన్న జి.మంగరాజు వాటిని సాకారం చేసుకోవడానికి విశేషంగా కృషి చేశారు. ముంబాయిలో ఉండే మాణిక్యాలాల్ శేఠ్‌తో పరిచయం ఏర్పడటంతో ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపి తెలుగులో టాకీ నిర్మాణానికి ముందడుగు వేసేలా చేశారు. 

అలా హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో తయారైన తొలి తెలుగు టాకీ 81 ఏళ్ల క్రితం 1932 ఫిబ్రవరి 6న విడుదలైంది. భారతీయ తొలి టాకీ 'ఆలంఆరా' విడుదలైన ఆరు నెలలకు అంటే 1931 సెప్టెంబర్ 15'భక్త ప్రహ్లాద' చిత్రం విడుదలైన మాట వాస్తవం కాదనీ, 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6న ఈ సినిమా విడుదలైందని ఆధారాలతో సహా పాత్రికేయుడు రెంటాల జయదేవ 'ఆంధ్రజ్యోతి' ద్వారా వెల్లడించిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మరో విషయం ఏమిటంటే ఈ సినిమా తొలిసారిగా విడుదలైంది అప్పటికి అం«ద్రులు పెద్ద సంఖ్యలో ఉన్న ముంబాయిలో. సెన్సారైన మరుసటి వారమే "తెలుగులో మాటలు, పాటలున్న భారత్ మూవీటోన్ వారి భక్తరస చిత్రం 'భక్తప్రహ్లాద్' త్వరలో విడుదల'' అనే ప్రకటన 1932 జనవరి 31 'ది బాంబే క్రానికల్'లో వచ్చింది. ఆ ప్రకటన వచ్చిన వారంలోపలే ముంబయిలోని న్యూ ఛార్నీ రోడ్డులో ఉన్న కృష్ణా సినిమాలో తొలిసారిగా 'భక్త ప్రహ్లాద' చిత్రం విడుదలైంది. ప్రీవ్యూ చూడటం వల్ల ఆ రోజుకి వచ్చేలా కొన్ని దినపత్రికలు సమీక్షలు రాశాయి. 1932 ఫిబ్రవరి 6'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' దినపత్రికలో కూడా 'భక్త ప్రహ్లాద' రివ్యూ వచ్చింది.

జయదేవ పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం ఈ సినిమా చెన్నయ్‌లో విడుదల కావడానికి మరో రెండు నెలలు పట్టింది. తెలుగు ఉగాదికి నాలుగు రోజుల ముందు అంటే 1932 ఏప్రిల్ 2 శనివారం 'నేషనల్ పిక్చర్ ప్యాలెస్' (ఇప్పటి బాడ్వే టాకీస్)లో విడుదలై రెండు వారాలు ఆడింది. ముంబయి నుంచి, అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజధాని చెన్నపట్నానికి వచ్చే లోపల 'భక్తప్రహ్లాద' ఇంకెక్కడెక్కడ ఆడిందో ఆధారాలు లేవు కానీ 'రాజమహేంద్రవరము నందు వరుసగా మూడు వారముల వరకూ ప్రజలనాకర్షించెను... (ఆంధ్రపత్రిక దినపత్రిక 1932 ఏప్రిల్ 2, పేజీ 14) అనే వాక్యం ఒక్కటే మనకు తెలుసు. ఆ ఒక్క వాక్యం మినహా, తెలుగు నేలపై ఏయే ప్రాంతాల్లో , ఏయే తేదీల్లో ఈ తొలి తెలుగు టాకీ ప్రదర్శితమైందో తెలిపే సాక్ష్యాలు దురదృష్టవశాత్తూ ఇప్పటికీ లభించడంలేదు.

కాగా 'భక్తప్రహ్లాద' 1932 ఫిబ్రవరి 6న విడుదలైందనే విషయాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికీ అంగీకరించడం లేదు. సెప్టెంబర్ 15, 2011న జరిగిన '80 ఏళ్ల తెలుగు టాకీ' సభలో విడుదల తేదీ గురించి ఇంకా పరిశోధనలు జరగాలని మాత్రం సినీ ప్రముఖులు పేర్కొన్నారు.

(6 ఫిబ్రవరి 2013, బుధవారం నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక, సినిమా పేజీలో ప్రచురితం)


3 వ్యాఖ్యలు: