జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, January 1, 2013

సమాజాన్ని మార్చే ఆయుధంగా సినిమా
కొరుక్కుపేట, న్యూస్‌లైన్ : సాధారణ మాధ్యమంగా ప్రారంభమైన సినిమా జన జీవన విధానంతో పాటు సమాజాన్ని మార్చగల ఆయుధంగా మారిందని జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడు, నంది అవార్డు విజేత డాక్టర్ రెంటాల జయదేవ అభివర్ణించారు. వేద విజ్ఞాన వేదిక, ఆంధ్రా సోష ల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారా వాహి క కార్యక్రమంలో తొలి తెలుగు సినీమాట-పాట- కవి అనే అంశంపై ఆదివారం రెంటాల జయదేవ ఉపన్యసించారు. డైలాగులు, పాటలతో వచ్చిన మొట్టమొదటి తెలుగు సినిమా కాళిదాస్ అని పేర్కొన్నారు. ఆ తరువాతనే భక్త ప్రహ్లాద తదితర చిత్రాలు తెలుగు భాషలో వెలుడ్డాయన్నారు.

1882-85 మధ్య కాలంలోనే సినిమా పేరు పెట్టిక ముందే ప్రదర్శన పేరుతో చిత్రాలు ఉండేవన్నారు. అప్పుడు చిన్నపాటి గ్లాజు స్లైడ్‌ల మీద బొమ్మలు గీచి ప్రదర్శించే వారని వివరించారు. ఆ తరువాత ఎన్నో తరాల నుంచి వస్తున్న తోలుబొమ్మలాట మూలంగా కథ చెప్పడం ప్రారంభమైందన్నారు.1896లో లూమియే బ్రదర్స్ రీల్ పద్ధతిలో చిన్న చిన్న సంఘటనలు చిత్రించి చూపిస్తూ వచ్చారని తెలిపారు. 1912లో ఆర్ ‌జీ టోర్నీ అనే వ్యక్తి పుండలీక అనే ప్రదర్శనను చిత్రించి సినిమాగా తీసుకువచ్చారని పేర్కొన్నారు. 1909లో రఘుపతి వెంకయ్య తన స్టూడియోను రూ.40 వేలకు తాకట్టుపెట్టి యంత్రా లు తీసుకువచ్చారని, వాటిని చెన్నై సెంట్రల్ సమీపంలో విక్టోరియా పబ్లిక్ హాలు‌లో అమర్చి చిత్రాలను ప్రదర్శించారని వెల్లడించారు. పరిసర ప్రాంతాలు, సంఘటనల ఆధారంగా సినిమాలను చిత్రించడం ప్రారంభించారని తెలిపారు. 1921లో మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞను రఘుపతి వెంకయ్య రూపొందించారని వివరించారు.

ఆ రోజుల్లో సినిమాల వైపు ప్రజలను ఆకర్షించేందుకు సోడా, కిల్లీలను ఇచ్చేవారని అన్నారు. ప్రకటనల కోసం కరపత్రాలను ముద్రించి పంచేవారని తెలిపారు. ఆ క్రమంలో సినిమాలు సీరియల్స్‌గా వచ్చేవని అన్నారు. సాధారణ మాద్యమంగా తయారైన సినిమా 10 ఏళ్లకే సమాజా న్ని మార్చే ఆయుధంగా మారిందన్నారు. ఆ తరువాత మాట్లాడే చిత్రం తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో దృశ్యంతో పాటు, డైలాగులను ఒకేసారి చూపిస్తూ చిత్రించారని వివరించారు. 1931 మార్చి 14న ఆలమారా సినిమాను తొలి భారతీయ టాకీ చిత్రంగా రూపొందించారన్నారు.

దక్షిణ భారతీయ ప్రాంతీయ భాషల్లో తొలి సినిమాగా కాళిదాస్ చిత్రం తీశారని చెప్పారు. ఇక్కడి నుంచే తెలుగు మాట, పాట మొదలైందని పేర్కొన్నారు. అనంతరం రెంటాల జయదేవ్‌ను చీరాలకు చెందిన సాంబమూర్తి, వడ్డిపాటి సుబ్రమణ్యం, ప్రసాద్ చందనమాల, శాలువతో సన్మానించారు. సినీ నిర్మాత, రచయిత కాట్రగడ్డ మురారి, జె.కె.రెడ్డి తదితరులు షీల్డుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖులు, ఆదిశేషయ్య, శ్రీనివాసులు రెడ్డి, ఘంటశాల రత్నకుమార్, కాసల నాగభూషణం, వీఏకే రంగారావు తదితరులు పాల్గొన్నారు.

26th November 2012, Monday, Sakshi Telugu daily, Tamilnadu Edition

(ఇది 'సాక్షి' తెలుగు దినపత్రిక తమిళనాడు సంచికలో 26 నవంబర్ 2012, సోమవారం నాడు ప్రచురితమైన నా ప్రసంగ వార్త.) 0 వ్యాఖ్యలు: