జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, February 7, 2012

తెలుగు ‘టాకీ’ పుట్టుకపై.... ‘సాక్షి’....లో

ఇది ఇవాళ్టి సాక్షి దినపత్రికలోది...
తెలుగు ‘టాకీ’ పుట్టి 80 ఏళ్ళు!

భారతీయ చలనచిత్ర రంగంలో మూకీలను వెనక్కి నెడుతూ టాకీలు వచ్చింది 1931లో! హిందీ - ఉర్దూల మిశ్రమ భాషలో తయారై, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదలైంది. ఆ తరువాత మరో ఏడు నెలలకు కానీ, మన దక్షిణాది భాషలలో మాట్లాడే టాకీ చిత్రాలు రాలేదు. తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం ‘కాళిదాస్’ 1931 అక్టోబర్ 31న విడుదలైంది. తెలుగు, తమిళ భాషలు రెండూ ఈ సినిమాతోనే తెరపై తొలిసారిగా వినిపించినప్పటికీ, ఎక్కువగా తమిళంలోనే మాటలు,పాటలున్నాయి కాబట్టి, తమిళులు దాన్ని తమ లెక్కలో వేసుకొని,‘కాళిదాస్’ ను తొలి తమిళ టాకీగా చెప్పుకొంటున్నారు. కానీ, నిజానికి అప్పట్లో ఆ చిత్రానికి ‘‘తమిళ - తెలుగు భాషల్లో మాట్లాడే చిత్రం’’ అంటూనే ప్రకటనలిచ్చారు.

ఇక, పూర్తిగా తెలుగులోనే సంభాషణలున్న తొలి టాకీ ‘భక్త ప్రహ్లాద’. ఇంతవరకూ ఆ చిత్రం సరైన విడుదల తేదీ ఏమిటన్నది ఎవరికీ తెలియదు. ‘కాళిదాస్’ 1931 అక్టోబర్ చివరలో వచ్చింది కాబట్టి, దానికి కనీసం నెలన్నర ముందు 1931 సెప్టెంబర్ 15న తొలి తెలుగు టాకీ విడుదలైనట్లు అందరూ భావిస్తున్నారు. ఏటేటా సెప్టెంబర్ 15ను ‘తెలుగు సినిమా జన్మదినం’గా జరుపుకొంటున్నారు. కానీ, ఈ పరిశోధకుడి అన్వేషణలో బయటపడ్డ వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.

దక్షిణాది భాషల్లో వచ్చిన తొలి టాకీలైన ‘కాళిదాస్’కూ, ‘భక్త ప్రహ్లాద’కూ రెండింటికీ దర్శకుడు ఒకరే. ఆయనే హెచ్.ఎం. రెడ్డి. తొలి తమిళ - తెలుగు టాకీ ‘కాళిదాస్’ 1931 అక్టోబర్ 31న విడుదలైతే, అంతకన్నా ముందే రిలీజైనట్లు ప్రచారంలో ఉన్న పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సెన్సారైందే - 1932 జనవరి చివరలో! ఆ జనవరి 22న ‘బొంబాయి బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్స్’ సెన్సారింగ్ చేసి, అదే తేదీన సెన్సార్ సర్టిఫికెట్ ను కూడా జారీ చేసింది. దీన్నిబట్టి, ఒకటి స్పష్టం. ‘భక్త ప్రహ్లాద’ 1931 సెప్టెంబర్ మధ్యలో విడుదల కాలేదు. ఇక, దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి సైతం సగం తమిళం - సగం తెలుగు మాటలున్న ‘కాళిదాస్’ విడుదలై విజయవంతమయ్యాకే, ఆ ఉత్సాహంతో పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ను రూపొందించినట్లు ఆ రోజుల్లోనే ఇంటర్వ్యూల్లో చెప్పారు. హెచ్.ఎం. రెడ్డితో అనుబంధం... తొలి నాళ్ళ టాకీలైన ‘ఆలమ్ ఆరా’, ‘కాళిదాస్’, ‘భక్త ప్రహ్లాద’లు మూడింటిలో పనిచేసిన సంబంధం ఉన్న ఎల్.వి. ప్రసాద్ సైతం ఆ వరుసే చెప్పారు. 1930ల తరం దర్శకుడు పి. పుల్లయ్య కూడా ఆ క్రమాన్నే పేర్కొనడం మరో ధ్రువీకరణ.

మరి ఇంతకీ, ‘భక్త ప్రహ్లాద’ అసలు సిసలు విడుదల తేదీ ఏమిటన్నట్లు? అది - 1932 ఫిబ్రవరి 6. అంటే ఈ 2012 ఫిబ్రవరితో పూర్తి తెలుగు టాకీ చిత్రానికి 80 ఏళ్ళు నిండుతున్నాయి. ఈ సాక్ష్యాధారాలను బట్టి, సగం తమిళం - సగం తెలుగు సినిమా వచ్చిన తరువాతే, పూర్తి తెలుగు టాకీ విడుదలైందనీ, తెలుగు సినిమా పుట్టిన రోజు సెప్టెంబర్ 15 కాదు, ఫిబ్రవరి 6 అనీ తేలిపోయింది. ఇకనైనా, తెలుగు సినిమాకు సరైన తేదీనే జన్మదినం జరుపుకోవడం విధాయకం!- డాక్టర్ రెంటాల జయదేవ

3 వ్యాఖ్యలు: